బీసీసీఐ 10 పాయింట్ల నియామవళిపై టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా విదేశీ టూర్లకు ఫ్యామిలీ మెంబర్స్ పై ఆంక్షలు విధించడాన్ని కోహ్లి తప్పుబట్టాడు. ఒంటరిగా గదిలో కూర్చని బాధపడలేం కదా అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
బయట జరిగే తీవ్రమైన విషయాల నుంచి కుటుంబాన్ని చేరుకున్నప్పుడు కలిగే ప్రశాంతతను వివరించడం కష్టమని కోహ్లి అన్నాడు. ‘‘తీవ్రమైన విషయాలు (మ్యాచ్ లు) ముగించుకుని తిరిగి కుటుంబాన్ని చేరుకున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో వివరించడం కష్టం. దీని విలువను ప్రజలు అర్థం చేసుకుంటారని అనుకోవడం లేదు. వాళ్ల చేతుల్లో లేని విషయాల్లోకి కూడా కుటుంబ సభ్యులను లాగి, ముందుకు నెట్టడంపై తీవ్ర నిరాశ కలుగుతోంది. ఈ విషయాల నుంచి కుటుంబాన్ని దూరం పెట్టాలి’’ అని ఆర్సీబీ ఇన్నోవేషన్ ల్యాబ్ లో కోహ్లి పేర్కొన్నాడు.
ఇండియా తరపున భారత క్రికెటర్లు రాణించకపోతే వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ ను మధ్యలోకి లాగడం కామన్ అయిపోయింది. ఈ విషయంపైనే కోహ్లి పై విధంగా రియాక్టయ్యాడు.
బాధను పంచుకోవడానికి ఎవరైనా తోడుగా ఉండాల్సిందేనని కోహ్లి అన్నాడు. ఒంటరిగా కూర్చుని బాధపడలేమని పేర్కొన్నాడు. ‘‘ఒంటరిగా కూర్చుని బాధపడాలనుకోం. ఫ్యామిలీ ఎప్పుడూ వెంటే ఉండాలా? అని ఏ క్రికెటర్ ను అడిగినా అవుననే చెప్తాడు. నేను నా గదికి వెళ్లి ఒంటరిగా బాధపడలేను. నార్మల్ గానే ఉండాలనుకుంటా. నీ ఆటను ఓ బాధ్యతగా భావిస్తే దాన్ని పూర్తి చేసుకుని తిరిగి సొంత జీవితంలోకి రావాలి’’ అని కోహ్లి చెప్పాడు.
గతేడాది స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ వైట్ వాష్, అనంతరం బోర్డర్- గావస్కర్ సిరీస్ ఓటమితో బీసీసీఐ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఆటగాళ్ల ప్రయాణం, వసతి, ప్రాక్టీస్, కుటుంబ సభ్యులు, దేశవాళీ క్రికెట్.. ఇలా 10 పాయింట్లతో నియమావళి రూపొందించింది. ఫిట్ గా ఉండి, అందుబాటులో ఉంటే ప్రతి ఆటగాడు దేశవాళీ క్రికెట్లో ఆడాలని స్పష్టం చేసింది.
విదేశీ పర్యటనల సమయంలో ఇండియా టీమ్ 45 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంటే భార్య, పిల్లలను ఆటగాళ్లతో రెండు వారాల పాటు ఉండేందుకు అవకాశమిస్తారు. అది ఫార్మాట్ ప్రకారం ఒక్కో సిరీస్ కు ఈ ఛాన్స్ ఉంటుంది.
ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్ లో పర్యటించిన కోహ్లీతో అతని భార్య అనుష్క కనిపించింది. భారత్ ఆడిన చివరి మూడు మ్యాచ్ లకు ఆమె స్టాండ్స్ లో ఉంది. భారత కెప్టన్ రోహిత్ భార్య రితికా, కూతురు సమైరా కూడా జట్టు విజయోత్సవాల్లో భాగమయ్యారు.
సంబంధిత కథనం