Virat Kohli: టీ20 ప్రపంచకప్‍లో విరాట్ కోహ్లీకి చోటు దక్కదా?
Virat Kohli - T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‍లో టీమిండియాలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి చోటు దక్కడం కష్టమేనని ఓ రిపోర్ట్ బయటికి వచ్చింది. అతడిని సెలెక్టర్లు పక్కన పెడతారని పేర్కొంది. ఆ వివరాలివే..
Virat Kohli: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇటీవల ఇంగ్లండ్‍తో టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడు. తనకు రెండో సంతానం కలగనున్న నేపథ్యంలో అతడు ఈ సిరీస్ నుంచి వైదొలిగాడు. మార్చి 22వ తేదీ నుంచి జరగనున్న ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. త్వరలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) క్యాంప్‍లో కోహ్లీ జాయిన్ అవుతాడని తెలుస్తోంది. ఐపీఎల్ తర్వాత ఈ ఏడాది జూన్‍లో టీ20 ప్రపంచకప్ జరగనుంది.
2022 టీ20 ప్రపంచకప్ తర్వాతి నుంచి భారత స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20లకు దూరమయ్యారు. టెస్టులు, వన్డేలు మాత్రమే ఆడుతూ వచ్చారు. అయితే, ఏడాది అఫ్గానిస్థాన్‍తో జరిగిన సిరీస్‍తో ఇద్దరూ మళ్లీ సుమారు 15 నెలల తర్వాత భారత్ తరఫున టీ20లో బరిలోకి దిగారు. దీంతో ఈ ఏదాది టీ20 ప్రపంచకప్‍లోనూ రోహిత్, కోహ్లీ ఉంటారని అంచనాలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్‍లో టీమిండియాకు కెప్టెన్‍గా రోహిత్ శర్మ ఉంటాడని బీసీసీఐ కార్యదర్శి జై షా అధికారికంగా ఇప్పటికే ప్రకటించారు. అయితే, టీ20 వరల్డ్ కప్‍లో విరాట్ కోహ్లీ ఉంటాడా లేదా అనే విషయంపై సందిగ్ధం ఉంది. అయితే, కోహ్లీని ఈ టోర్నీకి సెలెక్టర్లకు పక్కన పెట్టనున్నారని తాజాగా ఓ రిపోర్ట్ వెల్లడైంది.
కోహ్లీకి చోటు కష్టమేనా!
టీ20ల్లో యువ ఆటగాళ్లు చాలా మంది అదరగొడుతుండటంతో టీ20 ప్రపంచకప్‍లో విరాట్ కోహ్లీకి చోటు ఇచ్చే అంశంపై సెలెక్టర్లు అంత సుముఖంగా లేరని టెలిగ్రాఫ్ రిపోర్ట్ వెల్లడించింది. వరల్డ్ కప్‍కు ఎంపికయ్యే భారత జట్టులో కోహ్లీ ఉండడం సందేహమేనని వెల్లడించింది.
టీ20ల్లో జట్టు అవసరానికి తగ్గట్టు కోహ్లీ ప్రస్తుతం ఇమడలేడని సెలెక్టర్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఐపీఎల్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున అద్భుతంగా, దూకుడుగా ఆడితే కోహ్లీని ప్రపంచకప్ కోసం తీసుకునేందుకు సెలెక్టర్లు ఆలోచిస్తారని ఆ రిపోర్ట్ పేర్కొంది.
గతేడాది వన్డే ప్రపంచకప్‍లో విరాట్ కోహ్లీ రాణించాడు. అయితే, దూకుడుగా కాకుండా ఎక్కువగా యాంకర్ రోల్ పోషించాడు. నిలకడగా ఆడి భాగస్వామ్యాలు నిర్మించాడు. అయితే, టీ20ల్లో యాంకర్ రోల్ పెద్దగా అవసరం ఉండదని సెలెక్టర్లు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. భారత యువ ఆటగాళ్లు చాలా మంది టీ20ల్లో రాణిస్తుండటంత కోహ్లీ విషయంలో కఠిన నిర్ణయం తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారని టాక్. అయితే, టీ20 ప్రపంచకప్‌కు కోహ్లీని ఎంపిక చేసే విషయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
టీ20 ప్రపంచకప్ జరిగే వెస్టిండీస్, అమెరికాలో స్లో పిచ్‍లు ఉంటాయని, అవి విరాట్ కోహ్లీ ఆట తీరుకు సూటవవని కూడా సెలెక్టర్లు ఆలోచిస్తున్నట్టు ఆ రిపోర్ట్ పేర్కొంది. మరోవైపు, వికెట్ కీపింగ్ కోటాలో టీ20 ప్రపంచకప్‍లో ధృవ్ జురెల్‍కు కూడా చోటు దక్కే అవకాశం ఉందని పేర్కొంది.
అప్పుడే క్లారిటీ..
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ జూన్ 2వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు జరగనుంది. ఈ టోర్నీ కోసం ప్రొవిజనల్ జట్టును మే నెలలో ఐసీసీకి బీసీసీఐ పంపాల్సి ఉంది. ఈ వరల్డ్ కప్‍లో భారత జట్టులో కోహ్లీ ఉంటాడా లేదా అనేది అప్పుడే క్లారిటీ రానుంది.