Virat Kohli: కోహ్లికి పాకిస్తాన్‌లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు - షాహిద్ అఫ్రీది ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా...పాకిస్థాన్‌లో పర్యటిస్తే బాగుంటుందని ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది అన్నాడు. కోహ్లికి పాకిస్థాన్‌లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని, వారంతా అతడి ఆటను ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటున్నారని అఫ్రీది తెలిపాడు.
Virat Kohli: విరాట్ కోహ్లికి పాకిస్థాన్‌లో చాలా మంది అభిమానులు ఉన్నారని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది అన్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లి దారుణంగా విఫలమయ్యాడు. లీగ్ మ్యాచ్ నుంచి సెమీస్ వరకు జరిగిన ఏడు మ్యాచుల్లో కేవలం 75 పరుగులు మాత్రమే చేసి విమర్శలను ఎదుర్కొన్నాడు. కీలకమైన ఫైనల్‌లో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి 59 బాల్స్‌లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. టీమిండియా వరల్డ్ కప్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ...
టీ20 వరల్డ్ కప్ తర్వాత 2025 ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్‌లో నిర్వహించబోతున్నది ఐసీసీ. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ మెగా టోర్నీ జరుగనుంది. ఇండియా, పాకిస్థాన్ మధ్య చాలా కాలంగా సరైన సంత్సంబంధాలు లేవు. క్రికెట్ టోర్నీల కోసం పాకిస్థాన్‌లో టీమిండియా పర్యటించడం లేదు. చాలా ఏళ్ల తర్వాత గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ కోసం ఇండియాకు పాకిస్థాన్ వచ్చింది. వరల్డ్ కప్‌కు ముందు పాకిస్థాన్‌లో జరిగిన ఆసియా కప్ కోసం టీమిండియా ఆ దేశానికి వెళ్లలేదు. దాంతో ఇండియా మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించారు.
లాహోర్ స్టేడియంలో...
తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా మ్యాచ్‌లు మొత్తం లాహోర్ స్టేడియంలోనే ఉండేలా పాకిస్థాన్ షెడ్యూల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా ఆటగాళ్లను పాకిస్థాన్ పంపించేందుకు బీసీసీఐ సుముఖంగా లేనట్లు సమాచారం. తమ ఆటగాళ్ల భద్రతా దృష్ట్యా టీమిండియా మ్యాచ్‌లను ఆసియా కప్ మాదిరిగానే హైబ్రీడ్ మోడల్‌లో తటస్థ వేదికలపై నిర్వహించాలని పట్టుపడుతోంది.
కోహ్లికి ఫ్యాన్స్ ఉన్నారు...
టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటించకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ కళ తప్పే అవకాశం ఉండటంతో బీసీసీఐని ప్రసన్నం చేసుకునే పనిలో పాకిస్థాన్ క్రికెటర్లు పడ్డారు. టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటిస్తే బాగుంటుందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది అన్నాడు. కోహ్లిని ఈ పాకిస్థాన్ హిట్టర్ ఆకాశానికి ఎత్తాడు.
కోహ్లికి పాకిస్థాన్‌లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని, తమ దేశ క్రికెటర్ల తో సమానంగా అతడిని అభిమానిస్తుంటారని షాహిద్ అఫ్రీది అన్నాడు. కోహ్లి ఆట ను పాకిస్థాన్‌లో ప్రత్యక్షంగా చూడాలని ఆ వీరాభిమానులతో పాటు తాను ఎదురుచూస్తోన్నట్లు షాహిద్ ఆఫ్రీది పేర్కొన్నాడు. ఒకవేళ కోహ్లి గనక పాకిస్థాన్ వస్తే ఇక్కడి ఆతిథ్యం, అభిమానుల ప్రేమ తప్పకుండా అతడికి ఇండియాను మరపిస్తాయని షాహిద్ అఫ్రీది అన్నాడు.
టీమిండియా పాకిస్థాన్‌కు వస్తే...
వన్డే వరల్డ్ కప్ కోసం ఇండియాలో పాకిస్థాన్ పర్యటించినప్పుడు క్రికెట్ అభిమానులు తమ దేశ ఆటగాళ్లపై ఎనలేని ప్రేమ, గౌరవాన్ని చూపించారని, అలాంటి స్వాగతమే ఇండియా ఆటగాళ్లకు తమ దేశంలో తప్పకుండా లభిస్తుందని షాహిద్ అఫ్రీది పేర్కొన్నాడు.
2005 -06 ఏడాదిలో టీమిండియా ఆటగాళ్లు పాక్ టూర్‌ను ఎంతో ఎంజాయ్ చేశారని అఫ్రీది గుర్తుచేశాడు. ఇండియా పాకిస్థాన్ మధ్య సంబంధాలు మెరుగుపడటానికి, రెండు దేశాల్లో క్రికెట్ టోర్నీలు జరగడానికి ఛాంపియన్స్ ట్రోఫీ ఓ చక్కటి వేదికగా ఉపయోగపడుతుందని తాను భావిస్తోన్నట్లు ఆఫ్రీది పేర్కొన్నాడు. అతడి కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.