Virat Kohli Injury: విరాట్ కోహ్లికి ఏమైంది.. నిన్న రాత్రి ఏం జరిగింది.. మాజీ కోచ్ రవిశాస్త్రి ఏం చెప్పాడంటే?
Virat Kohli Injury: విరాట్ కోహ్లికి ఏమైంది? ఇంగ్లండ్ తో తొలి వన్డేకు దూరమైన కోహ్లికి ఏం జరిగిందో అన్న ఆందోళన అభిమానుల్లో కనిపిస్తోంది. అయితే కోహ్లి ఆడకపోవడం వెనుక కారణమేంటో రవిశాస్త్రి వెల్లడించాడు.

Virat Kohli Injury: ఇండియా, ఇంగ్లండ్ మధ్య తొలి వన్డేకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరమయ్యాడన్న వార్త చాలా మందిని షాక్ కు గురి చేసింది. ఎప్పుడూ ఫిట్‌గా ఉండే విరాట్.. గాయం కారణంగా మ్యాచ్ కు దూరం కావడం ఏంటన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే మ్యాచ్ ప్రారంభమైన కాసేపటి కామెంటరీలో ఉన్న రవిశాస్త్రి మాట్లాడుతూ.. కోహ్లి మోకాలిలో వాపు కనిపించినట్లు చెప్పాడు.
కోహ్లికి మోకాలి గాయం
గతేడాది ఆగస్ట్ తర్వాత ఇప్పుడే తొలిసారి వన్డే మ్యాచ్ ఆడటానికి సిద్ధమవుతున్న విరాట్ కోహ్లి అనూహ్యంగా గాయం కారణంగా తొలి వన్డేకు దూరమయ్యాడు. అతని మోకాలికి గాయమైందని మాత్రం చెప్పారు. కానీ దాని తీవ్రత ఎంత అన్నది తెలియలేదు.
నిజానికి అతడు మెడ నొప్పితో బాధపడుతున్నాడని కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. దీంతో ఒక రంజీ మ్యాచ్ కు కూడా దూరంగా ఉన్నాడు. కానీ ఇంగ్లండ్ తో సిరీస్ కు అతడు పూర్తి ఫిట్‌నెస్ తో సిద్ధమయ్యాడు. అయితే సడెన్ గా తొలి వన్డేకు దూరం కావడంతో విరాట్ కు ఏమైందన్న ఆందోళన ఫ్యాన్స్ లో కనిపించింది.
దీనికి రవిశాస్త్రి సమాధానం చెప్పాడు. అతనితోపాటు కామెంటరీ చేస్తున్న దీప్ దాస్ గుప్తా మాట్లాడుతూ.. "రాత్రి ఏదో జరిగినట్లుంది" అని అన్నాడు. దీనికి రవిశాస్త్రి స్పందిస్తూ.. "అతని మోకాలిలో వాపు కనిపించినట్లు నేను విన్నాను" అని వెల్లడించాడు.
కోహ్లి రెండో వన్డే ఆడతాడా?
తొలి వన్డే టాస్ కు ముందు కూడా కోహ్లి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అయితే ఆ సమయంలో అతడు అంత సౌకర్యంగా కనిపించలేదు. మోకాలి గాయం కారణంగా ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది. ప్రపంచంలోనే ఫిట్టెస్ట్ క్రికెటర్ గా పేరుగాంచిన విరాట్.. ఈ మధ్య తరచూ గాయాల బారిన పడుతున్నాడు. అయితే ఇప్పుడతడు రెండో వన్డే ఆడతాడా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ మ్యాచ్ సమయానికి పూర్తిగా కోలుకొని ఆడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తుది జట్టులోకి రావడానికి విరాట్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే చివరి వన్డే సిరీస్ కావడంతో ఇందులో కోహ్లి ఆడి తిరిగి ఫామ్ లోకి రావాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దీంతో అతడు 90 శాతం ఫిట్ గా ఉన్నా కూడా రెండో వన్డే బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.
సంబంధిత కథనం