Virat Kohli Fine: విరాట్ కోహ్లికి షాక్.. కోన్‌స్టాస్‌తో ఫైట్.. జరిమానా విధించిన ఐసీసీ
Virat Kohli Fine: విరాట్ కోహ్లికి షాక్ తగిలింది. ఆస్ట్రేలియా కుర్ర క్రికెటర్ సామ్ కోన్‌స్టాస్ తో గొడవకు దిగడంపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనికి జరిమానా విధించింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఆటలో ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే.
Virat Kohli Fine: ఆస్ట్రేలియాతో గురువారం (డిసెంబర్ 26) మొదలైన బాక్సింగ్ డే టెస్టు తొలి రోజే విరాట్ కోహ్లి వివాదంలో చిక్కుకున్నాడు. ఆస్ట్రేలియా తరఫున తొలి టెస్టు ఆడుతున్న సామ్ కోన్‌స్టాస్ ను కోహ్లి కావాలనే ఢీకొట్టి గొడవకు దిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఐసీసీ తీవ్రంగా పరిగణించి కోహ్లి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది. కోహ్లి గొడవకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కోహ్లి వర్సెస్ కోన్‌స్టాస్
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య గురువారం (డిసెంబర్ 26) మెల్‌బోర్న్ లో బాక్సింగ్ డే టెస్టు మొదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తొలి సెషన్ లోనే ఆస్ట్రేలియా ఓపెనర్ కోన్‌స్టాస్ తో విరాట్ గొడవకు దిగాడు. బుమ్రా బౌలింగ్ లో ఓ సిక్స్ తోపాటు ఒకే ఓవర్లో 14 రన్స్ చేసిన కోన్‌స్టాస్ మరో ఎండ్ కి వెళ్లే సమయంలో అతనికి ఎదురుగా వస్తున్న కోహ్లి.. అతని భుజాన్ని ఢీకొట్టి గొడవకు దిగాడు.
కోహ్లియే కావాలని చేసినట్లు వీడియోలు స్పష్టం చేయడంతో ఐసీసీ అతనిపై చర్యలు తీసుకుంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని ఆర్టికల్ 2.12ను విరాట్ ఉల్లంఘించినట్లు తేలడంతో 20 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించారు. తాను చేసిన తప్పును కోహ్లి అంగీకరించడంతో దీనిపై విచారణ అవసరం లేదని మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ స్పష్టం చేశాడు.
చెలరేగిన కోన్‌స్టాస్
బుమ్రా బౌలింగ్ లో ఆడటానికి ఆస్ట్రేలియా బ్యాటర్లంతా కిందామీదా పడుతుంటే.. ఈ 19 ఏళ్ల కోన్‌స్టాస్ మాత్రం చెలరేగిపోయాడు. బుమ్రా వేసిన తొలి రెండు, మూడు ఓవర్లు కాస్త ఇబ్బంది పడుతూ ఆచితూచి ఆడినా.. తర్వాత రెచ్చిపోయాడు. కోహ్లితో గొడవ తర్వాత మరింత చెలరేగాడు. బుమ్రా బౌలింగ్ లో ఓసారి ఒకే ఓవర్లో 14 పరుగులు, తర్వాతి ఓవర్లో 18 పరుగులు బాదడం విశేషం. ఈ రెండు ఓవర్లలోనూ రెండు సిక్స్ లు కొట్టాడతడు.
దీంతో బుమ్రా తన తొలి స్పెల్ 6 ఓవర్లలో ఏకంగా 38 పరుగులు ఇచ్చాడు. తొలి 3 ఓవర్లలో కేవలం 2 పరుగులే ఇచ్చిన బుమ్రాకు.. తర్వాత కోన్‌స్టాస్ చుక్కలు చూపించాడు. ఆడుతున్న తొలి టెస్టులోనే కేవలం 52 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కోన్‌స్టాస్.. చివరికి 65 బంతుల్లో 60 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడు ఇచ్చిన ధైర్యంతో ఫామ్ లోలేని ఖవాజాతోపాటు లబుషేన్, స్మిత్ కూడా హాఫ్ సెంచరీలు చేశారు. దీంతో ఆస్ట్రేలియా తొలి రోజు 6 వికెట్లకు 311 రన్స్ చేసింది.