virat kohli: బట్లర్ పై విరాట్ ఫ్యాన్స్ ఫైర్.. త్రో విసురుతావా అంటూ కామెంట్లు.. సోషల్ మీడియాలో వైరల్
virat kohli: ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ పై విరాట్ కోహ్లి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రెండో వన్డేలో బట్లర్ విసిరిన త్రో నేరుగా కోహ్లీకి తాకింది. దీంతో కోహ్లి ఏకాగ్రత చెదిరిందని, వెంటనే ఔట్ అయిపోయాడని ఫ్యాన్స్ బట్లర్ ను టార్గెట్ చేసుకున్నారు.

విరాట్ ఫ్యాన్స్ ఫైర్
ఆదివారం (ఫిబ్రవరి 9) కటక్ లో ఇంగ్లండ్ తో జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లి కేవలం 5 పరుగులే చేసి ఔటయ్యాడు. అయితే విరాట్ ఔట్ కు బట్లర్ కారణమంటూ అతని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అంతకుముందే బట్లర్ విసిరిన త్రో విరాట్ తాకింది. దీంతో కోహ్లి కాన్సంట్రేషన్ దెబ్బతిందని అతని ఫ్యాన్స్ బట్లర్ పై సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
కోహ్లికి తగిలిన బట్లర్ త్రో
రెండో వన్డేలో 305 పరుగుల ఛేదనలో తొలి వికెట్ కు రోహిత్, గిల్ 136 పరుగులు జోడించారు. గిల్ ఔటైన తర్వాత కోహ్లి క్రీజులోకి వచ్చాడు. అట్కిన్సన్ బౌలింగ్ లో ఫోర్ కొట్టిన కోహ్లి రిథమ్ మీద కనిపించాడు. కానీ స్పిన్నర్ రషీద్ వేసిన 20వ ఓవర్ రెండో బంతిని కోహ్లి డ్రైవ్ చేయగా.. పాయింట్ లో ఉన్న బట్లర్ బంతిని ఆపి వికెట్ కీపర్ కు త్రో విసిరాడు. కానీ అది కోహ్లికి తాకింది.
బట్లర్ సారీ
త్రో కోహ్లీకి తాకడంతో వెంటనే బట్లర్ సారీ చెప్తూ చేయి పైకెత్తాడు. కోహ్లి కూడా ఓకే అంటూ చేయి ఊపాడు. కానీ స్టేడియంలోని ఫ్యాన్స్ ఒక్కసారిగా అరిచారు. అయితే ఆ తర్వాతి బంతికే కోహ్లి వికెట్ కీపర్ సాల్ట్ చేతికి చిక్కాడు. రివ్యూలో ఇంగ్లండ్ ఈ వికెట్ సాధించింది. దీంతో 8 బంతుల్లో 5 పరుగులే చేసి కోహ్లి పెవిలియన్ చేరాడు.
సోషల్ మీడియాలో పోస్టులు
అయితే కోహ్లి ఔట్ కు బట్లర్ విసిరిన త్రో కారణమంటూ అతని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బట్లర్ త్రో తగలడంతో కోహ్లి ఏకాగ్రత కోల్పోయాడని అంటున్నారు. అందుకే తర్వాతి బంతికే క్యాచ్ ఔటయ్యాడని బట్లర్ ను టార్గెట్ చేశారు.
సంబంధిత కథనం