Champions Trophy: క్రిస్ గేల్ రికార్డు పై కన్నేసిన కోహ్లి.. మరో 263 పరుగులు చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో చరిత్ర
Champions Trophy: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ రికార్డును కోహ్లి బద్దలు కొట్టే అవకాశం ఉంది.

ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 19న ఆరంభమయ్యే ఈ టోర్నీలో రికార్డుల వేటకు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సై అంటున్నాడు. ఈ టోర్నీలో కోహ్లి పరుగుల వేటలో నిలకడ కొనసాగిస్తే అరుదైన రికార్డును సొంతం చేసుకునే అవకాశముంది. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ను వెనక్కి నెట్టి ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి నిలిచే ఛాన్స్ ఉంది.
మరో 263 పరుగులు
ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగుల వీరుడిగా వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ కొనసాగుతున్నాడు. అతను 17 మ్యాచ్ ల్లో 52.73 సగటుతో 791 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలున్నాయి. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో 11 వ స్థానంలో ఉన్న కోహ్లి 13 మ్యాచ్ ల్లో 529 పరుగులు సాధించాడు. యాక్టివ్ క్రికెటర్లలో కోహ్లీదే టాప్ ప్లేస్. అతను మరో 263 పరుగులు చేస్తే గేల్ రికార్డును బద్దలుకొడతాడు.
88.16 సగటు
ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీకి అద్భుతమైన రికార్డుంది. ఇప్పటివరకూ 13 మ్యాచ్ లాడిన అతను ఏకంగా 88.16 సగటుతో పరుగులు నమోదు చేయడం విశేషం. స్ట్రైక్ రేట్ 92.32గా ఉంది. 2017 టోర్నీ సెమీస్ లో బంగ్లాదేశ్ పై అజేయంగా చేసిన 96 పరుగులు కోహ్లి టాప్ స్కోరు. ఈ సారి అతను సెంచరీ చేయడంతో పాటు రికార్డులు తిరగరాస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
హాఫ్ సెంచరీతో
కోహ్లీకి బహుశా ఇదే చివరి ఛాంపియన్స్ ట్రోఫీ కావొచ్చు. ఈ టోర్నీకి ముందు ఇంగ్లండ్ తో మూడో వన్డేలో హాఫ్ సెంచరీతో కోహ్లి ఫామ్ అందుకున్నాడు. ఇదే జోరును ఐసీసీ టోర్నీలో కొనసాగిస్తే జట్టుకు తిరుగుండదు. గతేడాది టీ20 ప్రపంచకప్ అందుకున్న కోహ్లి.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీని ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
సంబంధిత కథనం