Virat Kohli vs Rohit Sharma: విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. టీమిండియా ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్స్ లో ఈ ఇద్దరు ప్లేయర్స్ కూడా ఉంటారు. ఆటలో ఎవరికి వారే సాటి అయినా.. వీళ్ల స్వభావాలు మాత్రం పూర్తిగా భిన్నమైనవని వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అన్నాడు. కెప్టెన్సీ వచ్చిన తర్వాత కోహ్లి చాలా మారిపోయాడని, రోహిత్ అలా కాదని అతడు అనడం గమనార్హం.
రోహిత్ శర్మ టీమ్ లోకి వచ్చిన తొలినాళ్లలో ఎలా ఉన్నాడో కెప్టెన్ అయిన తర్వాత కూడా అలాగే ఉన్నాడని, విరాట్ కోహ్లి విషయంలో అది ఆశించలేమని అమిత్ మిశ్రా అన్నాడు. యూట్యూబర్ శుభాంకర్ మిశ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్స్ గురించి అతడు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సచిన్ టెండూల్కర్, ధోనీలాంటి గౌరవమే మిగతా ప్లేయర్స్ అందుకుంటారా అన్న ప్రశ్నకు అమిత్ మిశ్రా ఇలా స్పందించాడు.
"నిజాయతీగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ అలా ఉండరు. నేను అబద్ధం చెప్పను. ఓ క్రికెటర్ గా అతన్ని నేను చాలా గౌరవిస్తాను. కానీ గతంలో అతనితో ఉన్నట్లు ఇప్పుడు ఉండటం లేదు. విరాట్ కోహ్లికి చాలా తక్కువ మంది స్నేహితులు ఎందుకు ఉన్నారు? అతని, రోహిత్ స్వభావాలు పూర్తిగా భిన్నం. రోహిత్ లో ఉన్న ఓ మంచి లక్షణం చెబుతాను. అతన్ని నేను తొలి రోజు కలిసినప్పుడు, ఇప్పుడు కలిసినప్పుడు ఒకేలా ఉన్నాడు. మరి అతనితో మంచి సంబంధాలు ఉంటాయా లేక టైమ్ బట్టి మారిపోయే వారితోనా" అని అమిత్ మిశ్రా ఎదురు ప్రశ్నించాడు.
"నేను ఇండియన్ టీమ్ లో లేక ఏళ్లు గడుస్తోంది. అయినా ఐపీఎల్ లేదా ఇతర ఈవెంట్లో నేను రోహిత్ ను కలిస్తే అతడు ఎప్పుడూ నాతో జోకులేస్తూ సరదాగా ఉంటాడు. అతడు ఏమనుకుంటాడో అన్న ఆలోచన నాకు ఉండదు. ఇద్దరం జోకులేసుకుంటాం. అతడు టాప్ లో ఉన్నా కూడా అదే సాన్నిహిత్యం కొనసాగిస్తున్నాం. అతడు కెప్టెన్, వరల్డ్ కప్ గెలిచాడు, ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచాడు" అని మిశ్రా అన్నాడు.
2008లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన అమిత్ మిశ్రా టీమిండియా తరఫున 22 టెస్టులు ఆడగా.. అందులో 9 విరాట్ కోహ్లి కెప్టెన్సీలోనే ఆడాడు. అయితే కోహ్లితో మొదట్లో ఉన్న సాన్నిహిత్యం లేదని, అతడు చాలా మారిపోయాడని, దాదాపు తాము మాట్లాడుకోవడం ఆపేశామని మిశ్రా చెప్పడం విశేషం.
"విరాట్ చాలా మారిపోవడం చూశాను. మేమిద్దరం మాట్లాడుకోవడం మానేశఆం. ఒకసారి పవర్, పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత ఎవరైనా తమను ఏదో పని కోసమే కలుస్తున్నారన్న భావన వాళ్లలో కలుగుతుంది. కానీ నేను అలాంటి వాడిని కాదు. చీకూ నాకు 14 ఏళ్ల వయసున్నప్పటి నుంచీ తెలుసు. కానీ అప్పటికీ చీకూకి, తర్వాత కెప్టెన్ అయిన విరాట్ కోహ్లికి చాలా మార్పు వచ్చింది. అప్పట్లో నన్ను కలిసినప్పుడల్లా ఎంతో గౌరవించేవాడు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు" అని మిశ్రా అనడం గమనార్హం.