India vs New Zealand - Virat Kohli: సచిన్ పేరిట ఉన్న 3 రికార్డులపై విరాట్ కోహ్లీ కన్ను.. సెమీఫైనల్‍లో బద్దలుకొడతాడా?-virat kohli can surpass these 3 sachin tendulkar records against new zealand in cricket world cup 2023 ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Virat Kohli Can Surpass These 3 Sachin Tendulkar Records Against New Zealand In Cricket World Cup 2023

India vs New Zealand - Virat Kohli: సచిన్ పేరిట ఉన్న 3 రికార్డులపై విరాట్ కోహ్లీ కన్ను.. సెమీఫైనల్‍లో బద్దలుకొడతాడా?

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 14, 2023 06:03 PM IST

India vs New Zealand - Virat Kohli: సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 3 రికార్డును బద్దలుకొట్టేందుకు భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సమీపించాడు. న్యూజిలాండ్‍తో జరిగే వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‍లోనే ఈ రికార్డులను సృష్టించే అవకాశం కోహ్లీకి ఉంది.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (BCCI Twitter)

India vs New Zealand - Virat Kohli: వన్డే ప్రపంచకప్‍లో ఇప్పటి వరకు దుమ్మురేపిన టీమిండియా సెమీఫైనల్ మెగా యుద్ధానికి రెడీ అయింది. లీగ్ దశలో తొమ్మిది మ్యాచ్‍ల్లో అన్ని గెలిచి జోష్‍తో భారత జట్టు ఉంది. వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‍లో రేపు (నవంబర్ 15) న్యూజిలాండ్‍తో టీమిండియా తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్ చేరాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. అయితే, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మూడు రికార్డులను ఈ మ్యాచ్‍లోనే బద్దలుకొట్టే అవకాశం భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉంది. ఆ వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

అత్యధిక వన్డే శతకాల రికార్డు

సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక వన్డే శతకాల(49) రికార్డును భారత స్టార్ విరాట్ కోహ్లీ ఈ ప్రపంచకప్‍లోనే సమం చేశాడు. గతవారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్‍లో సెంచరీ బాదాడు. 49వ వన్డే శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. న్యూజిలాండ్‍తో సెమీఫైనల్‍లో శకతం చేస్తే.. వన్డేల్లో అత్యధిక శతకాల రికార్డును కోహ్లీ కైవసం చేసుకుంటాడు. సచిన్ టెండూల్కర్‌ను దాటేస్తాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో 50 శతకాలు చేసిన ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు.

ప్రపంచకప్‍లో అత్యధిక పరుగులు

ఒక వన్డే ప్రపంచకప్ ఎడిషన్‍లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇంకా సచిన్ టెండూల్కర్ పేరిటే ఉంది. 2003 వన్డే ప్రపంచకప్‍లో సచిన్ 673 పరుగులు చేశాడు. ప్రస్తుత ప్రపంచకప్‍లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 594 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‍తో జరిగే సెమీస్‍లో కోహ్లీ 80 పరుగులు చేస్తే.. సచిన్ రికార్డును బద్దలుకొడతాడు. ఒకే ప్రపంచకప్ ఎడిషన్‍లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు అతడికి కైవసం అవుతుంది.

అత్యధిక 50ప్లస్ స్కోర్లు

ఒక వన్డే ప్రపంచకప్ ఎడిషన్‍లో ఎక్కువసార్లు (7 మ్యాచ్‍ల్లో) 50 కంటే ఎక్కువ స్కోర్లు చేసిన సచిన్ టెండూల్కర్, బంగ్లా ప్లేయర్ షకీబల్ హసన్ రికార్డును విరాట్ కోహ్లీ ఇటీవలే సమం చేశాడు. నెదర్లాండ్స్ జట్టుతో మ్యాచ్‍లో ఆ రికార్డును చేరుకున్నాడు. ఈ ప్రపంచకప్‍లో ఇప్పటి వరకు 2 సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు కోహ్లీ. న్యూజిలాండ్‍తో సెమీఫైనల్‍లో 50 కంటే ఎక్కువ స్కోరు చేస్తే సచిన్, షకీబ్‍లను కోహ్లీ అధిగమిస్తాడు. ఓ ప్రపంచకప్ ఎడిషన్‍లో అత్యధిక సార్లు 50కంటే ఎక్కువ స్కోర్లు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు.

WhatsApp channel