అది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం.. ఫ్యాన్స్ గా భారీగా స్టేడియానిక ఎగబడ్డారు. అలా అని అక్కడ ప్రపంచకప్ మ్యాచ్ ఏం జరగలేదు. కనీసం ఇంకే మ్యాచ్ కూడా లేదు. కానీ ఫ్యాన్స్ అందరూ ఒకే పేరుతో స్టేడియాన్మి మార్మోగించారు. ఆ పేరు.. విరాట్ కోహ్లి. టెస్టు రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్ 2025 కోసం తిరిగి గ్రౌండ్ లోకి వచ్చిన అతణ్ని చూసేందుకు ఫ్యాన్స్ పోటీపడ్డారు. ప్రాక్టీస్ సెషన్ కే మ్యాచ్ కంటే ఎక్కువ హైప్ ఇచ్చారు.
2024 టీ20 ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లి 20 ఓవర్ల ఫార్మాట్ ను వదిలేశాడు. ఇటీవల టెస్టు క్రికెట్ కూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు కేవలం టీమిండియా తరపున వన్డేల్లో, ఐపీఎల్ లో ఆర్సీబీకి ఆడతాడు. ఓ ఏడాదిలో వన్డేలో తక్కువగానే ఉంటాయి. ఇక మిగిలింది ఐపీఎల్. అందుకే ఐపీఎల్ లో కోహ్లి ప్రాక్టీస్ నూ మిస్ చేసేందుకు ఫ్యాన్స్ ఇష్టపడటం లేదు. కోహ్లి ప్రాక్టీస్ కూ భారీ సంఖ్యలో అటెండ్ అవుతున్నారు.
ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో నివేదిక ప్రకారం.. కోహ్లీ స్టేడియంలోకి ప్రవేశించే దృశ్యాన్ని చూడటానికి గురువారం మధ్యాహ్నం అభిమానులు చిన్నస్వామి స్టేడియం గేట్ల ముందు క్యూ కట్టారు. కేకేఆర్ బస్సు మొదట రావడంతో వారు గంటకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది. కానీ ఆర్‌సీబీ ఎరుపు, బంగారు రంగు బస్సు కనిపించగానే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
"కింగ్ కోహ్లీ!" నినాదాలతో సాధారణ ఆర్‌సీబీ నెట్స్ సెషన్ ప్రపంచ కప్ వాతావరణాన్ని తలపించింది. కబ్బన్ పార్క్ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. కోహ్లీ మాత్రం ఎప్పటిలాగే సాధారణంగా కనిపించాడు. అతను పార్క్‌లో సాయంత్రం నడిచినంత తేలికగా మెట్లు ఎక్కాడు. ఆ తర్వాత వెంటనే తన ఆటను మొదలుపెట్టాడు. అదే తీవ్రత, అదే దూకుడు, ప్రతిసారీ మైదానంలో అడుగుపెట్టినప్పుడు 100% కంటే ఎక్కువ ఇవ్వాలనే తపన కోహ్లీలో ఏమీ మారలేదు.
విరాట్ కోహ్లీ తన ప్యాడ్లు ధరించి, మూడు బ్యాట్లు చేతిలో పట్టుకుని మైదానంలోకి రావడం అందరికీ సుపరిచితమే. అలాగే వచ్చిన విరాట్ ను కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానె పలకరించాడు. ఆ తర్వాత నెట్స్ లో 45 నిమిషాల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు విరాట్. కోహ్లీ డ్రైవ్‌లు, కట్‌లు, షార్ట్-ఆర్మ్ షాట్లను అలవోకగా ఆడాడు. నెట్ ప్రాక్టీస్ లో బౌలర్లను చితక్కొట్టాడు. భారీ షాట్లు ఆడాడు. ఈ వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
కోహ్లీ తన బ్యాటింగ్ సెషన్ అంతటా తన ప్రత్యేకమైన అంకితభావాన్ని ప్రదర్శించాడు. ప్రతి షాట్‌పై నిలకడగా దృష్టి పెట్టడం, షాట్ సరిగ్గా ఆడకపోతే అసహనం వ్యక్తం చేయడం, బంతి తనను దాటి వెళితే "కమ్ ఆన్!" అని గట్టిగా అరవడం కనిపించాయి. అయితే అతను ప్రాక్టీస్ ముగించి తన గేర్‌ను సర్దుకోవడం ప్రారంభించగానే నెట్ బౌలర్లు ఒక్కొక్కరుగా వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
సంబంధిత కథనం