Virat Kohli Anushka: భార్యాపిల్లలతో కలిసి విరాట్ కోహ్లి ఆధ్యాత్మిక యాత్ర.. మళ్లీ ఆ గురువు దగ్గరికి.. వీడియో వైరల్
Virat Kohli Anushka: విరాట్ కోహ్లి మరోసారి భార్యాపిల్లలతో కలిసి ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాడు. రెండేళ్ల తర్వాత మళ్లీ తమ ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Virat Kohli Anushka: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతులకు ఆధ్యాత్మిక చింతనే చాలా ఎక్కువే. ఏమాత్రం ఖాళీ దొరికినా గుళ్లూగోపురాలూ, ఆధ్యాత్మిక గురువుల దగ్గరకు వెళ్తుంటారు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటన నుంచి వచ్చిన తర్వాత మరోసారి కోహ్లి దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ ధామ్ లో ఉన్న ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ జీ మహారాజ్ దగ్గరికి వెళ్లారు.
విరాట్ కోహ్లి ఆధ్యాత్మిక యాత్ర
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని వచ్చిన విరాట్ కోహ్లి.. ఇప్పుడు ఇంగ్లండ్ తో సిరీస్ ప్రారంభానికి ముందు దొరికిన కాస్త ఖాళీ సమయాన్ని ఆధ్యాత్మిక చింతన కోసం వాడుకుంటున్నాడు. తాజాగా అతడు తన భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్ లతో కలిసి యూపీలోని బృందావన్ ధామ్ లో ఉన్న ప్రేమానంద్ జీ మహారాజ్ దగ్గరికి వెళ్లారు.
గతంలో జనవరి 2023లోనూ వీళ్లు ఆ గురువు ఆశీస్సులు తీసుకున్నారు. రెండేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి ఆయన దగ్గరకు వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీళ్లు వెళ్లగానే ప్రేమానంద్ ఎదుట సాష్టాంగ ప్రణామం చేయడం ఈ వీడియోలో చూడొచ్చు.
ఆ తర్వాత ఆయనతో అనుష్క మాట్లాడింది. "కిందటిసారి మేము వచ్చినప్పుడు నా మనసులో కొన్ని ప్రశ్నలు మెదిలాయి. వాటిని అడగాలని అనుకున్నాను కానీ అప్పటికే అక్కడ కూర్చున్న వాళ్లు వాటిని అడిగేశారు. మాలో మేమే మీతో మాట్లాడినట్లుగా అనిపించింది. మాకు కేవలం మీ ప్రేమ, భక్తి మాత్రమే చాలు" అని అనుష్క చెప్పింది.
ఇంత సాధించిన మీరు గొప్పోళ్లు
ఈ సందర్భంగా ప్రేమానంద్ జీ మహారాజ్ కూడా విరాట్, అనుష్కలతో మాట్లాడారు. "మీ ఇద్దరూ చాలా ధైర్యవంతులు. ప్రపంచంలో మీరు ఇంత సాధించిన తర్వాత కూడా భక్తి వైపు మొగ్గు చూపడం చాలా కష్టం. మీకున్న భక్తికి మీరు అనుకున్నవన్నీ మీకు దక్కుతాయి" అని ప్రేమానంద్ అన్నారు.
కోహ్లి గురించి మాట్లాడుతూ.. "ఇతని ఆటే సాధన, భక్తి కూడా. ఇతడు విజయం సాధిస్తే దేశంలోని ప్రతి ఒక్కరూ సంతోషిస్తారు. అందుకే అతనికి ఇదే సాధన, భక్తి. ప్రాక్టీసే అన్నింటి కంటే గొప్పది" అని అన్నారు.
ఈ మధ్యే విరాట్ కోహ్లి ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడిన విషయం తెలిసిందే. అయితే తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడం మినహా.. తర్వాత అన్ని టెస్టుల్లోనూ అతడు దారుణంగా విఫలమై విమర్శల పాలయ్యాడు. ఇక ఇప్పుడు ఇంగ్లండ్ తో వన్డే సిరీస్, వచ్చే నెల ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్నాడు.