విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతులు మరోసారి ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు. సోమవారం (మే 12) కోహ్లి టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరుసటి రోజే ఈ దంపతులు తాము ఎంతగానో విశ్వసించే బృందావన్ లోని స్వామీ ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహారాజ్ ను కలవడానికి వెళ్లడం విశేషం.
విరాట్ కోహ్లి, అనుష్క ఇద్దరూ దేవుడిని బలంగా నమ్ముతారు. సమయం దొరికినప్పుడల్లా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా బృందావన్ లోని ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ ఆశ్రమానికి వెళ్తుంటారు. తాజాగా తాను టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా కోహ్లి, అనుష్క దంపతులు అక్కడికే వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమ పిల్లలు వామికా, అకాయ్ లతో కలిసి కోహ్లి, అనుష్క ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ స్వామీజీ ముందు వీళ్లు మోకరిల్లడం కూడా ఈ ఫొటోల్లో చూడొచ్చు. ఈ ఆశ్రమానికి వీళ్లు గతంలోనూ చాలాసార్లు వచ్చారు. స్వామీజీ సత్సంగ్‌లకు హాజరవుతూ ఉంటారు. తమ జీవితంలో ఏ ముఖ్యమైన సందర్భం వచ్చినా కూడా ఈ ఇద్దరూ ఈ ఆశ్రమానికి వెళ్లి స్వామీజీ ఆశీర్వాదం తీసుకుంటారు. సామాన్య భక్తుల్లాగే వీళ్లు అక్కడికి వెళ్తే ఎంతో భక్తిపారవశ్యంలో మునిగి తేలుతారు.
టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే కోహ్లి భార్య అనుష్కతో కలిసి ఎయిర్‌పోర్టులో కనిపించాడు. అతడు ఇప్పుడిలా బృందావన్ లో కనిపించి ఆశ్చర్యపరిచాడు.
విరాట్ కోహ్లి టెస్టులకు కూడా గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. గతేడాది టీ20ల నుంచి తప్పుకున్న అతడు.. తాజాగా సాంప్రదాయ ఐదు రోజుల క్రికెట్ నుంచి కూడా వైదొలిగాడు. దీంతో కేవలం వన్డే క్రికెట్ లోనే అతడు కొనసాగనున్నాడు. 14 ఏళ్లుగా టెస్టుల్లో కొనసాగిన అతడు 30 సెంచరీలు, 9 వేలకుపైగా పరుగులు చేయడం విశేషం.
ప్రస్తుతం కోహ్లి ఐపీఎల్లో ఆడుతున్నాడు. ఆర్సీబీ ఈ సీజన్లో టాప్ ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇండోపాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అర్ధంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్.. మళ్లీ శనివారం (మే 17) నుంచి ప్రారంభం కాబోతోంది. ఆ రోజు ఆర్సీబీ, కేకేఆర్ తలపడబోతున్నాయి.
సంబంధిత కథనం