Virat Kohli Record: విరాట్ కోహ్లి మరో రెండు రికార్డులు.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ బ్యాటర్ అతడే
Virat Kohli Record: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఓ అరుదైన రికార్డుతో ఐపీఎల్ కొత్త సీజన్ మొదలు పెట్టాడు. ఇప్పటి వరకూ ఏ ఇతర ఇండియన్ బ్యాటర్ కూ సాధ్యం కాని రికార్డు ఇది.
Virat Kohli Record: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి చాలా రోజుల తర్వాత క్రికెట్ లోకి వచ్చినా.. తనదైన స్టైల్లో ఓ అరుదైన రికార్డుతో మొదలుపెట్టాడు. ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ లోనే కోహ్లి రెండు బ్యాటింగ్ రికార్డులు తన పేరిట రాసుకున్నాడు. సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లి టీ20ల్లో 12 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.

విరాట్ కోహ్లి రికార్డు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆర్సీబీ, సీఎస్కే మధ్య తొలి మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లి తన ఆరో పరుగు తీసి టీ20ల్లో 12 వేల రన్స్ పూర్తి చేశాడు. ఐపీఎల్లో ఇప్పటికే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా కోహ్లి నిలవగా.. ఇండియా తరఫున టీ20ల్లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ కూడా కోహ్లియే.
ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో జడేజా బౌలింగ్ లో సింగిల్ తీయడం ద్వారా కోహ్లి తన 12000వ టీ20 పరుగు పూర్తి చేశాడు. అతని కంటే ముందు ఐదుగురు బ్యాటర్లు ఈ ఘనత సాధించారు. వాళ్లలో క్రిస్ గేల్, షోయబ్ మాలిక్, కీరన్ పొలార్డ్, అలెక్స్ హేల్స్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ రికార్డుకు చేరువగా ఉన్నాడు. రోహిత్ 426 టీ20ల్లో 11156 రన్స్ చేశాడు.
టీ20ల్లో 12 వేల పరుగుల వీరులు
క్రిస్ గేల్ - 463 మ్యాచ్ లలో 14562 రన్స్
షోయబ్ మాలిక్ - 542 మ్యాచ్ లలో 13360 రన్స్
కీరన్ పొలార్డ్ - 660 మ్యాచ్ లలో 12900 రన్స్
అలెక్స్ హేల్స్ - 449 మ్యాచ్ లలో 12319 రన్స్
డేవిడ్ వార్నర్ - 370 మ్యాచ్ లలో 12065 రన్స్
విరాట్ కోహ్లి 377 మ్యాచ్ లలో 12015 రన్స్
ఐపీఎల్ చరిత్రలో కోహ్లి మరో రికార్డు
టీ20ల్లో 12 వేల పరుగులే కాదు.. ఐపీఎల్ చరిత్రలో మరో అరుదైన రికార్డును కూడా ఇదే మ్యాచ్ లో కోహ్లి సొంతం చేసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై తొలి మ్యాచ్ లో 21 పరుగులు చేసిన విరాట్.. ఆ జట్టుపై 1000 పరుగులు పూర్తి చేశాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు ఫ్రాంఛైజీలపై 1000కిపైగా రన్స్ చేసిన తొలి ఇండియన్ బ్యాటర్ విరాట్ కోహ్లియే.
గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ పై కూడా విరాట్ 1000 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఇక తాజా మ్యాచ్ లో తన 15వ పరుగు తీయడం ద్వారా సీఎస్కేపై ఈ ఘనత సాధించాడు. ఓ సిక్స్ ద్వారా కోహ్లి ఈ రికార్డు అందుకోవడం విశేషం. రెండున్నరల నెలల తర్వాత మళ్లీ క్రికెట్ లోకి వచ్చినా.. ఈ మ్యాచ్ లో కోహ్లి మంచి టచ్ లో కనిపించాడు. అయితే 21 పరుగులు చేసిన తర్వాత ఓ భారీ షాట్ కు ప్రయత్నించి బౌండరీ దగ్గర రహానే కళ్లు చెదిరే క్యాచ్ కు ఔటయ్యాడు.
ఇక విరాట్ కోహ్లి కంటే ముందు డేవిడ్ వార్నర్ కూడా ఇలా రెండు ఫ్రాంఛైజీలపై 1000కిపైగా రన్స్ చేశాడు. అతడు కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లపై ఈ ఘనత సాధించాడు.