USA vs Ban T20I: అమెరికా సరికొత్త చరిత్ర.. టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన పసికూన
USA vs Ban T20I: టీ20 క్రికెట్ లో యూఎస్ఏ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏకంగా బంగ్లాదేశ్ జట్టును ఓ టీ20 మ్యాచ్ లో ఓడించింది. ఓ టెస్ట్ ఆడే దేశంలో అమెరికా టీ20 గెలవడం ఇది రెండోసారి మాత్రమే.
USA vs Ban T20I: టీ20 వరల్డ్ కప్ కు ముందు ఆ మెగా టోర్నీ ఆతిథ్య దేశాల్లో ఒకటైన యూఎస్ఏ (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా) సంచలన విజయం సాధించింది. బంగ్లాదేశ్ తో మంగళవారం (మే 21) జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ లో అమెరికా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లడం విశేషం.
బంగ్లాదేశ్‌కు షాక్
అంతర్జాతీయ క్రికెట్ లో యూఎస్ఏ ఓ పసికూన. ఆ జట్టు బంగ్లాదేశ్ లాంటి టెస్ట్ ఆడే దేశంపై గెలవడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ తమ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ను అమెరికా 5 వికెట్లతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్ హూస్టన్ లో జరిగింది. ఇక టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభానికి 10 రోజుల ముందు ఈ విజయం సాధించడం ఆతిథ్య దేశం ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే.
మోనక్ పటేల్ కెప్టెన్సీలో యూఎస్ఏ ఈ మ్యాచ్ బరిలోకి దిగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ను 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులకే కట్టడి చేసింది. బంగ్లా టీమ్ లోని స్టార్ బ్యాటర్లు లిటన్ దాస్ (14), సౌమ్య సర్కార్ (20), షకీబుల్ హసన్ (6) విఫలయ్యారు. దీంతో ఒక దశలో బంగ్లా టీమ్ 68 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
ఆ ఇద్దరూ ఆదుకున్నారు
ఈ దశలో బంగ్లాదేశ్ కనీసం 100 పరుగులైనా చేస్తుందా అన్న సందేహం కలిగింది. అయితే తౌహిద్ హృదయ్ (58), మహ్మదుల్లా (31) ఆ టీమ్ ను ఆదుకున్నారు. దీంతో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేయగలిగింది. నిజానికి యూఎస్ఏలాంటి జట్టుకు ఆ టార్గెట్ కూడా అంత సులువేమీ కాదు. అందులోనూ బంగ్లాదేశ్ బౌలింగ్ లైనప్ పటిష్టంగానే ఉంది.
అయినా అమెరికా ఊహించని విజయం సాధించింది. మరో 3 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ప్రస్తుతం అమెరికాకు ఆడుతున్న న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ కోరే ఆండర్సన్ (34), హర్మీత్ సింగ్ (13 బంతుల్లోనే 33) చెలరేగడంతో బంగ్లా టీమ్ కు ఓటమి తప్పలేదు. హర్మీత్ 3 సిక్స్ లు, రెండు ఫోర్లు బాదాడు.
హర్మీత్ మనవాడే..
నిజానికి ఈ హర్మీత్ సింగ్ ఇండియాకు అండర్ 19 స్థాయిలో ఆడగా.. దేశవాళీ క్రికెట్ లో ముంబైకి, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్లకు కూడా ఆడాడు. ప్రస్తుతం అమెరికా జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. తొలి టీ20లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అతనికే దక్కింది. మేము వాకోవర్ ఇచ్చేలాంటి జట్టు అనే ఫీలింగ్ బంగ్లాదేశ్ కు కలగకుండా చూడాలన్న ఉద్దేశంతో ఆడినట్లు హర్మీత్ చెప్పాడు.
నిజానికి చేజింగ్ లో యూఎస్ఏ కూడా 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా.. ఆండర్సన్, హర్మీత్ మరో వికెట్ కోల్పోకుండానే టార్గెట్ చేజ్ చేసేశారు. ఇద్దరూ కలిసి ఆరో వికెట్ కు కేవలం 28 బంతుల్లోనే 64 పరుగులు జోడించి ఈ చారిత్రక విజయాన్ని సాధించారు. ఇంతకుముందు టెస్ట్ క్రికెట్ హోదా ఉన్న ఐర్లాండ్ పై మాత్రమే 2021లో యూఎస్ఏ గెలిచింది.