IPL 2025 Bat Test: క్రికెట్ బ్యాటర్ల గేమ్ గా మారిపోయింది. ఏ ఫార్మాట్ అయినా భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్లో రికార్డులు బ్రేకవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సీజన్ ఐపీఎల్లో బ్యాటర్లు వాడుతున్న బ్యాట్లను అంపైర్లు చెక్ చేస్తున్నారు. వాటి వల్ల వాళ్లకు ఎలాంటి అదనపు లబ్ధి చేకూరకూడదన్న ఉద్దేశంతో బ్యాట్ గేజ్ (Bat Gauge) టెస్ట్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాట్ ను అంపైర్లు చెక్ చేయడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ మ్యాచ్ లో బ్యాటర్లు షిమ్రాన్ హెట్‌మయర్, ఫిల్ సాల్ట్ బ్యాటింగ్ ను అర్ధంతరంగా ఆపిన అంపైర్లు వాళ్ల బ్యాట్లను కూడా చెక్ చేశారు.
దీనిని బ్యాట్ గేజ్ టెస్ట్ గా చెబుతున్నారు. ఇందులో భాగంగా ఓ పరికరం గుండా బ్యాట్ ను పంపిస్తారు. అది ఒకేసారి సులువుగా అందులో నుంచి వెళ్లిందంటే ఆ బ్యాట్ ను అనుమతిస్తారు. లేదంటే బ్యాటర్ మరో బ్యాట్ వాడాల్సిందే. ఇలా ఎందుకు చేస్తున్నారో తాజాగా బీసీసీఐ వివరణ ఇచ్చింది.
బ్యాటర్లు వాడుతున్న బ్యాట్లను అంపైర్లు ఎందుకు చెక్ చేస్తున్నారో బీసీసీఐ మాజీ కోశాధికారి, ఐపీఎల్ ఛైర్మన్ అయిన అరుణ్ ధుమాల్ వెల్లడించారు. “కొందరికి అదనపు లబ్ధి చేకూరుతోందన్న అభిప్రాయం ఎవరికీ కలగకూడదు. ఆటలో సమన్యాయం కోసం బీసీసీఐ, ఐపీఎల్ అన్ని చర్యలు తీసుకుంటోంది.
అన్ని నిర్ణయాలు సరిగ్గా ఉండేందుకు టెక్నాలజీ సాయంతో ఆటగాళ్ల రివ్యూలను అనుమతిస్తున్నాం. ఇప్పుడు బ్యాట్ చెక్ కూడా అందులో భాగమే” అని అరుణ్ ధుమాల్ చెప్పారు.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ప్రతి మ్యాచ్ లో ఓపెనింగ్ బ్యాటర్లు బరిలోకి దిగే ముందే నాలుగో అంపైర్ వాళ్ల బ్యాట్లను పరీక్షిస్తాడు. ఇక ఆన్ ఫీల్డ్ అంపైర్లు మిగిలిన బ్యాటర్ల బ్యాట్లను టెస్ట్ చేస్తారు. నిజానికి గతంలో మ్యాచ్ ముందు రోజు సాయంత్రం బ్యాట్ చెక్ చేసేవారు. అయితే కొందరు బ్యాటర్లు మరుసటి రోజు మ్యాచ్ లో మరో బ్యాట్ తో బరిలోకి దిగడంతో ఇప్పుడిలా మ్యాచ్ సందర్భంగానే బ్యాట్ గేజ్ టెస్ట్ చేస్తున్నారు.
బంతి ఎక్కువగా తగిలే బ్యాట్ దిగువ భాగంలో లావుగా ఉండే బ్యాట్లను బ్యాటర్లు వాడటం ఎక్కువైంది. దీనివల్ల బంతి తగలగానే బౌండరీ అవతల పడేంత పవర్ వస్తుంది. ఇలాంటివి జరగకుండా బ్యాట్ గేజ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. పంజాబ్ కింగ్స్, కేకేఆర్ మ్యాచ్ లో సునీల్ నరైన్ ఈ టెస్టులో ఫెయిలవడంతో తన బ్యాట్ ను మార్చాల్సి వచ్చింది.
అంతర్జాతీయ క్రికెట్ లో వాడే బ్యాట్లకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. వీటి ప్రకారం.. ఓ బ్యాట్ వెడల్పు 4.25 అంగుళాల కంటే ఎక్కువగా ఉండకూడదు. ఇక బ్యాట్ మందం 2.64 అంగుళాలు మాత్రమే ఉండాలి. బ్యాట్ అంచులు 1.56 అంగుళాలకు మించకూడదు. హ్యాండిల్ విషయానికి వస్తే.. బ్యాట్ మొత్తం పొడవులో 52 శాతానికి మించకూడదన్న నిబంధన ఉంది. అధికారిక బ్యాట్ గేజ్ లో నుంచి బ్యాట్ సులువుగా పాస్ కావాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం