Rohit Sharma: రంజీ ట్రోఫీలో రోహిత్ శర్మను ఔట్ చేసిన ఈ 6 అడుగుల 4 అంగుళాల బౌలర్ గురించి తెలుసా? రోహిత్ అభిమానే ఇలా..
Rohit Sharma: రంజీ ట్రోఫీలోనూ రోహిత్ శర్మ విఫలమైన విషయం తెలుసు కదా. అయితే అతన్ని ఔట్ చేసిన 6 అడుగుల 4 అంగుళాల ఆజానుబావుడైన ఆ బౌలర్ ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మంది క్రికెట్ అభిమానుల్లో కలిగింది.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త ఫామ్ రంజీ ట్రోఫీలోనూ కొనసాగింది. చాలా ఏళ్ల తర్వాత అతడు ఆడిన తొలి రంజీ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లోనే రోహిత్.. కేవలం 3 పరుగులే చేసి ఔటయ్యాడు. జమ్ముకశ్మీర్ తో జరిగిన ఈ మ్యాచ్ లో ఆ టీమ్ బౌలర్ ఉమర్ నజీర్ మిర్.. రోహిత్ ను ఔట్ చేశాడు. అతని అభిమాని అయిన ఉమర్ ఎత్తు ఏకంగా 6 అడుగుల 4 అంగుళాలు కావడం విశేషం.

ముంబై పని పట్టిన ఉమర్ నజీర్
జమ్ము కశ్మీర్ తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ లో ముంబై బ్యాటింగ్ కుప్పకూలింది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబెలాంటి స్టార్ బ్యాటర్లు ఉన్న ఆ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ గా వచ్చిన రోహిత్ శర్మ కేవలం 3 పరుగులే చేశాడు.
అతనితోపాటు మరో మూడు కీలకమైన వికెట్లు తీసి ముంబై పతనాన్ని శాసించాడు జమ్ము కశ్మీర్ బౌలర్ ఉమర్ నజీర్ మిర్. ఏకంగా 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉన్న ఈ పేస్ బౌలర్ ధాటికి ముంబై బ్యాటర్లు నిలవలేకపోయారు. రోహిత్ తోపాటు సీనియర్లు అయిన రహానే, శివమ్ దూబెల వికెట్లు కూడా ఉమరే తీశాడు. ఈ 31 ఏళ్ల పేస్ బౌలర్ తన ఎత్తును సద్వినియోగం చేసుకుంటూ అదనపు బౌన్స్ రాబట్టి ముంబై బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు.
క్రీజులోకి వచ్చినప్పటి నుంచీ ఉమర్ బౌలింగ్ లో ఇబ్బంది పడిన రోహిత్.. అతనికే తన వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్ రహానేను 12 పరుగులకు, హార్దిక్ తామోర్ ను 7పరుగులకు, శివమ్ దూబెను సున్నా పరుగులకే మిర్ ఔట్ చేశాడు.
ఎవరీ ఉమర్ నజీర్ మిర్?
జమ్ము కశ్మీర్ కు చెందిన ఉమర్ నజీర్ మిర్ ఓ పేస్ బౌలర్. 2013లోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకూ 57 మ్యాచ్ లలో 138 వికెట్లు తీసుకున్నాడు. అంతేకాదు లిస్ట్ ఎ క్రికెట్ లో 54 వికెట్లు, టీ20ల్లో 32 వికెట్లు తీశాడు. జమ్ము కశ్మీర్ లోని పుల్వామాకు చెందిన ఉమర్ నజీర్ గతంలో దేవధర్ ట్రోఫీలో ఇండియా సి టీమ్ తరఫున ఆడాడు.
గతేడాది అక్టోబర్ లో సర్వీసెస్ జట్టుపై 53 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసుకున్న ఉమర్.. తన కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఇప్పుడు ముంబైలాంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ను తన పదునైన పేస్ తో కుప్పకూల్చాడు.
అందుకే సెలబ్రేట్ చేసుకోలేదు: ఉమర్
ఇక్కడ మరో విశేషం ఏమిటంటే రోహిత్ శర్మకు ఉమర్ నజీర్ వీరాభిమాని. అలాంటిది అతని వికెటే తీస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఉమర్ మాత్రం రోహిత్ వికెట్ ను అసలు సెలబ్రేట్ చేసుకోలేదు. తాను రోహిత్ కు అభిమానిని అని, అందుకే సెలబ్రేట్ చేసుకోకూడదని ముందుగానే అనుకున్నట్లు ఉమర్ చెప్పాడు.
తాను ఔట్ చేసినా.. అతడో పెద్ద ప్లేయర్ అని, రోహిత్ కు తాను పెద్ద అభిమానిని అని చెప్పుకొచ్చాడు. ఓ అంతర్జాతీయ ప్లేయర్ ను ఔట్ చేయడం ఎప్పుడూ చాలా ఆనందంగానే ఉంటుందని ఈ సందర్భంగా ఉమర్ అన్నాడు.
సంబంధిత కథనం