U19 World Cup: సెమీస్‌లో ఇంగ్లండ్‌ను చితగ్గొట్టేసిన అమ్మాయిలు.. వుమెన్స్ అండర్ 19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియన్ టీమ్
U19 World Cup: వుమెన్స్ అండర్ 19 టీ20 వరల్డ్ కప్ లో భారత అమ్మాయిల విజయ పరంపర కొనసాగుతోంది. సెమీపైనల్లో ఇంగ్లండ్ ను చితగ్గొట్టేసి 9 వికెట్లతో గెలిచిన ఇండియన్ టీమ్.. ఫైనల్లో అడుగుపెట్టింది.
U19 World Cup: ఇండియా వుమెన్ అండర్ 19 టీమ్ దూకుడు కొనసాగుతోంది. వుమెన్స్ అండర్ 19 టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లండ్ వుమెన్ అండర్ 19తో శుక్రవారం (జనవరి 31) జరిగిన సెమీఫైనల్లో 9 వికెట్లతో సునాయాసంగా గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. అంతకుముందే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా వుమెన్ అండర్ 19 టీమ్ ను సౌతాఫ్రికా వుమెన్ టీమ్ ఓడించి ఫైనల్ చేరింది. ఈ ఇద్దరి మధ్య ట్రోఫీ కోసం ఆదివారం (ఫిబ్రవరి 2) ఫైనల్ జరగనుంది.

చితగ్గొట్టేసిన ఇండియా వుమెన్ అండర్ 19 టీమ్
ఐసీసీ వుమెన్స్ అండర్ 19 టీ20 వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ నుంచి దూకుడు ప్రదర్శిస్తున్న ఇండియా వుమెన్ అండర్ 19 టీమ్ సెమీఫైనల్లో మరింత చెలరేగిపోయింది. ఇంగ్లండ్ వుమెన్ అండర్ 19 టీమ్ తో శుక్రవారం (జనవరి 31) పూర్తి ఏకపక్షంగా జరిగిన మ్యాచ్ లో 9 వికెట్లతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు కేవలం 113 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన ఇండియన్ టీమ్ 114 పరుగుల లక్ష్యాన్ని 15 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి ఛేదించడం విశేషం. ఓపెనర్ కమలిని 50 బంతుల్లో 56 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. మరో ఓపెనర్ గొంగడి త్రిష 29 బంతుల్లో 35 రన్స్ చేసింది.
ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 60 పరుగులు జోడించారు. త్రిష ఔటైనా.. తర్వాత వచ్చిన సనికా (11 నాటౌట్) మరో వికెట్ పడకుండానే మ్యాచ్ ముగించారు. ఇంగ్లండ్ టీమ్ ఎక్స్‌ట్రాల రూపంలోనే 15 పరుగులు ఇవ్వడంతో ఇండియన్ టీమ్ 15 ఓవర్లలోనే టార్గెట్ చేజ్ చేసేసింది.
ఇంగ్లండ్ టీమ్‌కు స్పిన్ ఉచ్చు
అంతకుముందు ఇంగ్లండ్ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 113 రన్స్ చేసింది. ఇండియన్ టీమ్ స్పిన్నర్ల ధాటికి ఇంగ్లండ్ చతికిల పడింది. పరునిక సిసోడియా, వైష్ణవి శర్మ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. ఇక ఆయుషి శుక్లా 2 వికెట్లు తీసుకుంది. ఇంగ్లండ్ టీమ్ ఓపెనర్ డావినా పెరిన్ 45 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. మిడిలార్డర్ లో కెప్టెన్ నార్‌గ్రోవ్ 30 రన్స్ చేసింది. మిగిలిన బ్యాటర్లందరూ విఫలమయ్యారు.
తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా వుమెన్ అండర్ 19 టీమ్ ను సౌతాఫ్రికా ఓడించి ఫైనల్ చేరింది. ఇప్పుడు ఇండియన్ టీమ్ కూడా ఫైనల్ చేరడంతో ఈ రెండు టీమ్స్ ఆదివారం (ఫిబ్రవరి 2) జరగబోయే ఫైనల్లో తలపడనున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్