Champions Trophy live: లేథమ్, యంగ్ సెంచరీలు.. ఫిలిప్స్ విధ్వంసం.. న్యూజిలాండ్ భారీ స్కోరు.. పాకిస్థాన్ కు కొండంత లక్ష్యం
Champions Trophy live: ఛాంపియన్స్ ట్రోఫీని విజయంతో ఘనంగా ఆరంభించేందుకు న్యూజిలాండ్ బాట వేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ తో బుధవారం (ఫిబ్రవరి 19) మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 320/5 స్కోరు చేసింది. విల్ యంగ్, టామ్ లేథమ్ సెంచరీలతో సత్తాచాటారు.

ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో బ్యాటింగ్ లో న్యూజిలాండ్ అదరగొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించింది. విల్ యంగ్, టామ్ లేథమ్ సెంచరీలతో చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 320 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
నెమ్మదిగా మొదలెట్టి
కరాచి జాతీయ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ కు దిగింది. ఆరంభంలో పిచ్ నుంచి సహకారాన్ని ఉపయోగింకుని పాక్ పేసర్లు రాణించారు. ముఖ్యంగా నసీం షా, హారిస్ రవూఫ్ చెరో రెండో వికెట్లతో మెరిశారు. దీంతో కాన్వే (10), విలియమ్సన్ (1), డరిల్ మిచెల్ (10) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. బ్లాక్ క్యాప్స్ 73/3తో కష్టాల్లో పడింది.
నిలబడ్డ యంగ్, లేథమ్
ఇబ్బందుల్లో పడ్డ కివీస్ ను ఓపెనర్ విల్ యంగ్ (107), టామ్ లేథమ్ (118 నాటౌట్) కలిసి ఆదుకున్నారు. పాక్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. మంచి టైమింగ్ తో షాట్లు కొట్టారు. స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. యంగ్ సెంచరీ తర్వాత ఔటయ్యాడు. నాలుగో వికెట్ కు యంగ్, లేథమ్ కలిసి 118 పరుగులు జోడించారు. యంగ్ ఔటైనా.. ఫిలిప్స్ (61) తో కలిసి లేథమ్ స్కోరు బోర్డును నడిపించాడు.
చివర్లో ధనాధన్
ఫిలిప్స్ మెరుపు షాట్లతో పాక్ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. ఎడాపెడా బౌండరీలు బాదాడు. 39 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. మరోవైపు 104 బంతుల్లో 118 పరుగులు చేసిన లేథమ్ 10 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. అయిదో వికెట్ కు లేథమ్, ఫిలిప్స్ 74 బంతుల్లోనే 125 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో కివీస్ భారీ స్కోరు అందుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లోనే స్కోరు 320 దాటడంతో ఈ టోర్నీలో రికార్డు పరుగులు నమోదవడం ఖాయమనిపిస్తోంది.
సంబంధిత కథనం