తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మళ్లీ అదరగొట్టాడు. ఐపీఎల్ 2025లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆదివారం (ఏప్రిల్ 13) ఢిల్లీ క్యాపిటల్స్ పై ఈ ముంబయి ఇండియన్స్ ఆటగాడు 33 బాల్స్ లో 59 రన్స్ చేశాడు. 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబయి 205/5 స్కోరు చేసింది.
ఐపీఎల్ 2025లో పేలవ ఫామ్ లో ఉన్న ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మళ్లీ ఫెయిలయ్యాడు. 2 ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టిన అతను.. యంగ్ స్పిన్నర్ విప్రజ్ చేతికి చిక్కాడు. అయినా రికిల్టన్ (25 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ (28 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టారు. పవర్ ప్లేలో ఆ టీమ్ 59/1తో నిలిచింది.
ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ స్పిన్నర్ కుల్ దీప్ బౌలింగ్ కు వస్తూనే రికిల్టన్ ను ఔల్డ్ చేశాడు. అక్కడి నుంచి తెలుగు కుర్రాడు తిలక్ వర్మ షో మొదలైంది. ఈ హైదరాబాద్ లెఫ్టార్మ్ బ్యాటర్ బౌండరీల మోత మోగించాడు.
చక్కని టైమింగ్ తో మంచి షాట్లు ఆడాడు. కవర్ డ్రైవ్, రివర్స్ స్వీప్, స్ట్రెయిట్ డ్రైవ్, లాఫ్టెడ్ షాట్లతో సాగిపోయాడు. సూర్యకుమార్ ను ఔట్ చేసి ముంబయి స్పీడ్ కు బ్రేక్ వేయాలని కుల్ దీప్ చూశాడు. కెప్టెన్ హార్దిక్ (2) ఇలా వచ్చి అలా వెళ్లాడు.
నమన్ ధీర్ తో కలిసి బాదుడు కొనసాగించిన తిలక్.. ఢిల్లీ బౌలర్లకు పట్టు బిగించే ఛాన్స్ ఇవ్వలేదు. విప్రజ్ బౌలింగ్ లో లాఫ్టెడ్ డ్రైవ్ తో అదిరే సిక్సర్ కొట్టాడు. 26 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. మరో ఎండ్ లో నమన్ ధీర్ కూడా భారీ షాట్లతో చెలరేగాడు. డేంజరస్ పేసర్ స్టార్క్ బౌలింగ్ లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు.
మోహిత్ బౌలింగ్ లో కిందకు వంగి ఫ్లిక్ తో స్క్వేర్ లెగ్ లో నమన్ బాదిన సిక్సర్ ఆకట్టుకుంది. లాస్ట్ ఓవర్లో తిలక్ ఔటయ్యాడు. అజేయంగా నిలిచిన నమన్ ధీర్ 17 బంతుల్లో 38 రన్స్ కొట్టాడు. 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. 223 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి టీమ్ స్కోరును 200 దాటించాడు.
సంబంధిత కథనం