Test Team of 2024: బుమ్రాకు కెప్టెన్సీ.. సొంత కెప్టెన్‌నే పక్కన పెట్టేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. టెస్ట్ ఆఫ్ ద ఇయర్ ఇదే
Test Team of 2024: టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ కు బుమ్రాను కెప్టెన్ ను చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. తమ సొంత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను పక్కన పెట్టడం విశేషం. ఈ టెస్టు టీమ్ లో ముగ్గురు ఇంగ్లండ్ ప్లేయర్స్ ఉండగా.. ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నుంచి ఇద్దరేసి ప్లేయర్స్ ఉన్నారు.
Test Team of 2024: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా క్రికెట్ ఆస్ట్రేలియా టెస్ట్ ఆఫ్ ద ఇయర్ 2024 కెప్టెన్ అయ్యాడు. ఏడాది చివరి రోజు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ ను అనౌన్స్ చేసింది. అయితే ఇందులో తమ సొంత కెప్టెన్, స్టార్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్ లేకపోవడం గమనార్హం. ఇంగ్లండ్ నుంచి ముగ్గురు ప్లేయర్స్ కు చోటు దక్కింది. ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నుంచి ఇద్దరేసి.. శ్రీలంక, సౌతాఫ్రికా నుంచి ఒక్కో ప్లేయర్ కు చోటు దక్కింది.
క్రికెట్ ఆస్ట్రేలియా టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్
టీమిండియా పేస్ బౌలర్ బుమ్రా ఇప్పటి వరకూ తన కెరీర్లో రెండేసార్లు కెప్టెన్ గా ఉన్నాడు. అందులో ఇంగ్లండ్ తో ఓ టెస్టు ఓడిపోగా.. ఈ మధ్యే ఆస్ట్రేలియాపై పెర్త్ టెస్టును ఇండియన్ టీమ్ గెలిచింది. అలాంటి ప్లేయర్ కు కెప్టెన్సీ ఇవ్వడం విశేషం. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి బుమ్రానే అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా ఉన్నాడు.
ఇక ఈ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ లో చోటు దక్కించుకన్న మరో ఇండియన్ ప్లేయర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్. అతడు 2024లో 15 టెస్టుల్లో ఏకంగా 1478 రన్స్ చేశాడు. అందులో మూడు సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఒక కేలండర్ ఏడాదిలో 36 సిక్స్ లు కొట్టిన ఘనత కూడా జైస్వాల్ సొంతం. పెర్త్ విజయంలో అతనిది కూడా కీలకపాత్రే. రెండో ఇన్నింగ్స్ లో 161 రన్స్ చేశాడు.
మిగిలిన ప్లేయర్స్ ఎవరంటే?
క్రికెట్ ఆస్ట్రేలియా టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ లో అత్యధికంగా ఇంగ్లండ్ నుంచి ముగ్గురు ప్లేయర్స్ కు చోటు దక్కింది. యశస్వి కాకుండా మరో ఓపెనర్ గా ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ ఉండగా.. మూడో స్థానంలో జో రూట్ ఉన్నాడు. టెస్టుల్లో 2024లో అత్యధిక పరుగులు సాధించిన ఘనత జో రూట్ సొంతం. అతడు 17 టెస్టుల్లో 1556 రన్స్ చేశాడు.
మరో ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ కూడా ఈ జట్టులో ఉన్నాడు. అతడు ఐదో స్థానంలో ఉండగా.. నాలుగో స్థానాన్ని న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీలంక బ్యాటర్ కమిందు మెండిస్, ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కేరీ, బుమ్రా, న్యూజిలాండ్ పేస్ బౌలర్ మ్యాట్ హెన్రీ, జోష్ హేజిల్‌వుడ్, సౌతాఫ్రికా ప్లేయర్ కేశవ్ మహరాజ్ ఉన్నారు.