Test Cricket: 148 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. 2024లో టెస్ట్ క్రికెట్ కొత్త రికార్డు.. 50 విజయాలు
Test Cricket: క్రికెట్ చరిత్రలో 2024 ఎప్పటికీ ప్రత్యేకంగా ఉండిపోతుంది. ఎందుకంటే 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2024లోనే అత్యధికంగా 50 విజయాలు నమోదయ్యాయి. టెస్టు అంటే డ్రా అనే పరిస్థితి నుంచి ఇప్పుడు దాదాపు ప్రతి మ్యాచ్ లోనూ విజయం కోసమే టీమ్స్ తలపడుతున్నాయనడానికి ఇదే నిదర్శనం.
Test Cricket: టెస్ట్ క్రికెట్ అంటే ఐదు రోజులు.. బోర్ బోర్ అని అనుకునే వాళ్లు. కానీ ఈ తరం క్రికెట్ అభిమానులకు తగినట్లుగానే టెస్ట్ క్రికెట్ ను ఆడుతున్నాయి ఇప్పటి టీమ్స్. దీనికి నిదర్శనం 2024లో టెస్ట్ క్రికెట్ లో వచ్చిన ఫలితాలే. ఒకప్పుడు టెస్ట్ క్రికెట్ అంటే డ్రా అయ్యే మ్యాచ్ లే ఎక్కువ. కానీ 2024లో మాత్రం మొత్తం 53 టెస్టులు జరగగా.. అందులో 50 విజయాలు వచ్చాయి. 148 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.
టెస్ట్ క్రికెట్.. మరో లెవల్..
టెస్ట్ క్రికెట్ ఆడే పద్ధతి పూర్తిగా మారిపోయినట్లు 2024ను చూస్తే స్పష్టమవుతోంది. ఒకటి రెండు కాదు.. దాదాపు ప్రతి టీమ్ కూడా టెస్టుల్లోనూ విజయం కోసమే ఆడుతున్నాయి. 2024లో మొత్తం 53 టెస్టులు జరగగా.. అందులో 50 టెస్టుల్లో ఫలితం వచ్చింది. కేవలం మూడే టెస్టులు డ్రాగా ముగిశాయి. ఇదొక్కటి చాలు టెస్ట్ క్రికెట్ ఎంతలా మారిపోయిందో చెప్పడానికి.
ఏడాదంతా టెస్ట్ క్రికెట్ కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. మెల్‌బోర్న్ లో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ముగిసిన బాక్సింగ్ డే టెస్ట్ కూడా చివరి సెషన్ లో ఫలితం తేలి అభిమానులకు మంచి థ్రిల్ అందించింది. ఈ ఏడాది ఇంగ్లండ్ టీమ్ అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలవగా.. ఇండియా రెండో స్థానంలో ఉంది.
ఇంగ్లండ్ టాప్.. జింబాబ్వే లాస్ట్
2024లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. నిజానికి ఈ టీమ్ ఇప్పటికే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి తప్పుకున్నా.. అత్యధిక విజయాల జాబితాలో తొలి స్థానంలో ఉండటం విశేషం. ఆ టీమ్ 2024లో 17 టెస్టులు ఆడగా.. 9 గెలిచింది.
ఇక రెండో స్థానంలో టీమిండియా ఉంది. మన టీమ్ 15 టెస్టులు ఆడగా.. అందులో 8 గెలిచింది. ఆరు ఓడిపోయింది. ఒకటి డ్రా అయింది. ఇండియన్ టీమ్ ఆడిన చివరి ఏడు టెస్టుల్లో ఐదింట్లో ఓడింది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా 9 టెస్టుల్లో ఆరు, న్యూజిలాండ్ 12 టెస్టుల్లో 6, సౌతాఫ్రికా 10 టెస్టుల్లో 6 మ్యాచ్ లు గెలిచాయి.
ఈ టీమ్స్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. శ్రీలంక కూడా 10 టెస్టుల్లో ఆరు గెలిచింది. బంగ్లాదేశ్ 10 టెస్టుల్లో 3 విజయం సాధించింది. ఐర్లాండ్ రెండు టెస్టులు ఆడి రెండింట్లోనూ గెలవగా.. పాకిస్థాన్ ఏడింట్లో 2 గెలిచి ఐదు ఓడింది. వెస్టిండీస్ 9 ఆడి రెండు గెలిచి, ఏడు ఓడిపోయింది. ఆఫ్ఘనిస్థాన్ మూడు ఆడి రెండు ఓడి, ఒకటి డ్రా చేసుకుంది. జింబాబ్వే టీమ్ రెండింట్లో ఒకటి ఓడి, మరొకటి డ్రా చేసుకుంది. ఇలా మొత్తంగా అన్ని టీమ్స్ కలిపి 53 టెస్టులు ఆడగా.. అందులో 50 టెస్టుల్లో ఫలితం వచ్చింది. మూడు మాత్రమే డ్రా అయ్యాయి.