Team India: నన్ను కావాలనే పక్కన పెడుతున్నాడు: టీమిండియా హెడ్ కోచ్ గంభీర్‌పై స్టార్ వికెట్ కీపర్ మండిపడ్డాడన్న రిపోర్టు
Team India: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై స్టార్ వికెట్ కీపర్ తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు టైమ్స్ నౌ రిపోర్టు వెల్లడించింది. అయితే ఆ వికెట్ కీపర్ పేరును మాత్రం ఆ రిపోర్టు బయటపెట్టలేదు.

Team India: టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ వచ్చినప్పటి నుంచీ మరోసారి జట్టులో విభేదాలు, లుకలుకలు అన్న వార్తలు వస్తున్న విషయం తెలుసు కదా. తాజాగా ఓ వికెట్ కీపర్.. గంభీర్ పై తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు టైమ్స్ నౌ రిపోర్టు వెల్లడించింది. తనను తుది జట్టులోకి మొదటి ఛాయిస్ గా పరిగణించడం లేదంటూ అతడు ఆరోపించినట్లు ఆ రిపోర్టు తెలిపింది.
గంభీర్ వివక్ష చూపిస్తున్నాడా?
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్లేయర్స్ పట్ల వివక్ష చూపిస్తున్నాడా? కొందరు ప్లేయర్స్ కే అతడు మేలు చేస్తున్నాడా? తాజాగా మంగళవారం (ఫిబ్రవరి 18) టైమ్స్ నౌ వెల్లడించిన రిపోర్టు చూస్తే అదే నిజమనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులోకి తనను మొదటి ఛాయిస్ వికెట్ కీపర్ గా గంభీర్ పరిగణించడం లేదని ఓ టాప్ ఇండియన్ క్రికెటర్ ఆరోపించినట్లు ఆ రిపోర్టు తెలిపింది.
అయితే ఆ ప్లేయర్ ఎవరన్నది మాత్రం చెప్పలేదు. ఆ వికెట్ కీపర్ ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉన్నాడా లేదా అన్నది కూడా తెలియలేదు. ప్రస్తుత ఇండియా వికెట్ కీపర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయని టైమ్స్ నౌ రిపోర్టు చెప్పింది. ప్రస్తుతం ఆ వికెట్ కీపర్ వన్డేల్లో ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ గా లేడని తెలిపింది. 50 ఓవర్ల ఫార్మాట్లో తాను స్థానం కోల్పోవడానికి బయటి కారణాలేవో ఉన్నాయని కూడా అతడు ఆరోపించినట్లు చెప్పింది.
ఎవరా వికెట్ కీపర్?
గంభీర్ పై వికెట్ కీపర్ ఆరోపణలన్న వార్తలో మరోసారి టీమిండియాలో కలకలం ఏర్పడింది. ఆ ప్లేయర్ ఎవరన్న చర్చ మొదలైంది. ప్రస్తుతం వన్డేల్లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ గా ఉంటున్నాడు. దీంతో అతడైతే ఈ ఆరోపణలు చేసే వీలు లేదు. అతడు కాకుండా ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టులో ఉన్న మరో వికెట్ కీపర్ రిషబ్ పంత్. ఇంగ్లండ్ తో వన్డేల్లో అతన్ని కాదని రాహుల్ కే అవకాశం ఇచ్చారు.
వీళ్లు కాకుండా టీమిండియా రేసులో ఉండే మరో ఇద్దరు వికెట్ కీపర్లు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్. చాలా రోజులుగా సంజూ టీ20 టీమ్ లో ఉంటున్నాడు. అయితే అతన్ని వన్డేలకు మాత్రం తీసుకోవడం లేదు. అటు ఇషాన్ కిషన్ పై వేటు పడి చాలా కాలమే అయింది. గంభీర్ రాక ముందు నుంచీ అతడు జట్టులో లేడు. దీంతో సంజూ శాంసనే ఈ ఆరోపణలు చేశాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ దీనిపై స్పష్టత లేదు.
మరోవైపు టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ తన తొలి మ్యాచ్ కు సిద్ధమవుతోంది. గురువారం (ఫిబ్రవరి 20) బంగ్లాదేశ్ తో తొలి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్థాన్ తో, మార్చి 2న న్యూజిలాండ్ తో ఆడాల్సి ఉంది. పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లతో కలిసి టీమిండియా గ్రూప్ ఎలో ఉంది. గ్రూప్ ఎ, గ్రూప్ బిలలోని టాప్ 2 టీమ్స్ సెమీ ఫైనల్స్ చేరతాయి.
సంబంధిత కథనం