Team India Zimbabwe Tour: టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్.. సన్ రైజర్స్ నుంచి ఇద్దరికి చోటు!
Team India Zimbabwe Tour: టీ20 వరల్డ్ కప్ తర్వాత జింబాబ్వే టూర్ కు వెళ్లే టీమిండియాకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్ గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు సన్ రైజర్స్ హైదరాబాద్ కు చెందిన ఇద్దరు ప్లేయర్స్ కు చోటు దక్కవచ్చు.
Team India Zimbabwe Tour: జింబాబ్వే పర్యటనకు మరోసారి యంగిండియాను పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ ముగిసిన వారానికి అంటే జులై 6 నుంచి జరగబోయే ఈ టూర్ లో శుభ్‌మన్ గిల్ కు కెప్టెన్సీ అప్పగించే అవకాశాలు ఉండగా.. అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డిలాంటి సన్ రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్లకు చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది.
జింబాబ్వే పర్యటనకు టీమిండియా
టీ20 వరల్డ్ కప్ కోసం రిజర్వ్ ప్లేయర్ గా టీమిండియాతో కలిసి యూఎస్ఏ వెళ్లిన శుభ్‌మన్ గిల్.. మధ్యలోనే తిరిగి వచ్చేశాడు. ఇక ఇప్పుడు జింబాబ్వే పర్యటనకు వెళ్లే యంగిండియాకు తొలిసారి కెప్టెన్ కాబోతున్నాడు. జులై 6 నుంచి హరారెలో ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ లాంటి వాళ్లు ఈ పర్యటనకు వెళ్లడానికి సుముఖంగా లేకపోవడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ తెలిపింది.
వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఈ ఇద్దరితోపాటు కోహ్లి, రోహిత్, బుమ్రా, జడేజాలాంటి సీనియర్లు రెస్ట్ తీసుకోనున్నారు. ఇప్పటికే ఈ టీమ్ ను ఎంపిక చేసిన సెలెక్టర్లు.. కెప్టెన్ ఎంపికపై దృష్టి సారించినట్లు ఆ రిపోర్టు తెలిపింది. రోహిత్ లేని సమయంలో హార్దిక్, సూర్యకుమార్ లాంటి వాళ్లు గతంలో టీ20 జట్లకు కెప్టెన్లుగా ఉన్నారు. ఇప్పుడు గిల్ ఆ పాత్ర పోషించబోతున్నాడు.
ఐపీఎల్ 2024లో కెప్టెన్‌గా ప్రమోషన్
శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కు వెళ్లిపోవడంతో గుజరాత్ టైటన్స్ అతనికి కెప్టెన్సీ అప్పగించింది. అంతకుముందు పంజాబ్ జట్టును సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఒకసారి కెప్టెన్ గా విజేతగా నిలిపాడు. అయితే ఈసారి గుజరాత్ కెప్టెన్ గా గిల్ అంతగా ప్రభావం చూపలేదు.
జట్టులో సన్ రైజర్స్ ప్లేయర్స్?
కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్ ని ఎంపిక చేసే అవకాశం ఉండగా.. జట్టులో అందరూ యువ ఆటగాళ్లే ఉండబోతున్నారు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ కోసం వెస్టిండీస్ లో ఉన్న రింకు సింగ్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ లతోపాటు అవేష్ ఖాన్ జట్టులో ఉండనున్నారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్లో చెలరేగిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డిలకు తొలిసారి పిలుపు అందే అవకాశం ఉంది.
వీళ్లకు తోడు రియాన్ పరాగ్, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండేలాంటి యువ ఆటగాళ్లు జింబాబ్వే వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. 2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే యంగిండియాను సిద్ధం చేయాలని బీసీసీఐ చూస్తోంది. ఇందులో భాగంగానే ఇలాంటి పర్యటనలకు సెకండ్ రేట్ టీమ ను పంపించి పరీక్షించబోతున్నారు. ఈ జట్టుకు లక్ష్మణ్ హెడ్ కోచ్ గా ఉండనున్నాడు. ఆ తర్వాత ఫుల్ టైమ్ హెడ్ కోచ్ గా గంభీర్ రావచ్చని భావిస్తున్నారు.