Sachin - Dhoni: టీమిండియాకు సచిన్, ధోనీ సలహాలు అవసరం - గిల్‌క్రిస్ట్ కామెంట్స్
Sachin - Dhoni: టీమిండియా వరల్డ్ కప్‌లో రాణించాలంటే సచిన్ టెండూల్కర్, ఎంఎస్‌ధోనీ లాంటి అనుభవజ్ఞుల సాయం తీసుకోవాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ సూచించాడు. వారు అందుబాటులో లేకపోతే యువరాజ్ సేవలనైనా ఉపయోగించుకోవాలని తెలిపాడు.
Sachin - Dhoni: టీమిండియా వన్డే వరల్డ్ కప్ దక్కించుకోవాలంటే సచిన్, ధోనీ లాంటి అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు అవసరమవుతాయని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు. రోహిత్ శర్మ సారథ్యంలో వన్డే వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియా బరిలోకి దిగుతోంది. తన తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తలపడనుంది.
భారత జట్టు వరల్డ్ కప్ సన్నాహాలపై ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. రోహిత్ సేన వరల్డ్ కప్‌లో రాణించాలంటే సచిన్, ధోనీ లాంటి అనుభవజ్ఞుల సాయం తీసుకోవాలని గిల్‌క్రిస్ట్ సలహా ఇచ్చాడు.
క్రికెట్‌లో వారికున్న అపారమైన అనుభవం యువ ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడుతుందని గిల్‌క్రిస్ట్ అన్నాడు. భారత జట్టులో నేను ఓ భాగమై ఉంటే...టీమ్‌తో కొన్నాళ్లు ప్రయాణం చేయమని సచిన్, ధోనీలను కోరేవాడినని గిల్‌క్రిస్ట్ చెప్పాడు. వరల్డ్ కప్ లాంటి కీలకమైన టోర్నీ ముందు వారు జట్టుతో కొంత టైమ్ స్పెండ్ చేయడం క్రికెటర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు.
ఆ దిశగా కోచ్‌తో పాటు రోహిత్ ఆలోచిస్తే మంచిదని అన్నాడు. ఒకవేళ సచిన్, ధోనీ అందుబాటులో లేకపోతే కనీసం యువరాజ్ లాంటి ప్రతిభావంతులైన ఆటగాడి సేవలనైనా టీమిండియా ఉపయోగించుకోవాలని గిల్‌క్రిస్ట్ తెలిపాడు.
ఇండియా 2011 వరల్డ్ కప్ గెలవడంతో ధోనీతో పాటు యువరాజ్ కీలకభూమిక పోషించారని, అలాంటి ఆటగాళ్ల అనుభవాలు యువ క్రికెటర్లు రాణించడానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని గిల్‌క్రిస్ట్ చెప్పాడు.గిల్‌క్రిస్ట్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.