Team India Home Coming: తుఫానులో చిక్కుకు పోయిన ఇండియన్ ప్లేయర్స్.. వరల్డ్ కప్ హీరోలు వచ్చేది ఆ రోజే..
Team India Home Coming: టీ20 వరల్డ్ కప్ హీరోలు తుఫానులో చిక్కుకుపోయారు. వాళ్లను తిరిగి ఇండియాకు తీసుకొచ్చేందుకు బీసీసీఐ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది.

Team India Home Coming: టీ20 వరల్డ్ కప్‌ను 17 ఏళ్ల తర్వాత రెండో సారి గెలుచుకున్న ఇండియన్ క్రికెట్ టీమ్.. తిరిగి స్వదేశానికి వచ్చేది ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఫైనల్ మ్యాచ్ జరిగిన బార్బడోస్ ను హరికేన్ బెరిల్ చుట్టుముట్టడంతో అక్కడే ఇరుక్కుపోయిన టీమ్ ను తీసుకురావడానికి బీసీసీఐ ఓ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది.
రేపే ఇండియాకు వరల్డ్ కప్ హీరోలు
వరల్డ్ కప్ హీరోలు బుధవారం (జులై 3) ఇండియాలో అడుగుపెట్టనున్నారు. ఈ తుఫానులో చిక్కుకొని ఇంకా బార్బడోస్ లోనే ఉన్న టీమిండియా కోసం మంగళవారం (జులై 2) ఓ ప్రత్యేక విమానాన్ని బీసీసీఐ ఏర్పాటు చేసినట్లు ఇండియా టుడే రిపోర్టు వెల్లడించింది. దాని ప్రకారం స్థానిక కాలమానంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఇండియన్ టీమ్ ఈ స్పెషల్ ఫ్లైట్ ఎక్కనుంది.
అంటే భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుఝామున 3.30 గంటలు. అప్పుడు బయలుదేరిన ఈ ఫ్లైట్.. బుధవారం రాత్రి 7.45 గంటలకు ఢిల్లీలో ల్యాండవనుంది. ఇక్కడ మన హీరోలకు ఘన స్వాగతం లభించేలా గట్టిగానే ఏర్పాట్లు చేస్తున్నారు. నిజానికి ఇప్పటికే టీమ్ ఇండియాకు రావాల్సి ఉన్నా.. హరికేన్ కారణంగా రెండు రోజులు ఆలస్యమైంది.
టీమిండియాకు భారీ నజరానా
ఇక ఇండియన్ టీమ్ కు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. వరల్డ్ కప్ గెలిచినందుకు అందిన ప్రైజ్ మనీ కంటే కూడా ఇది ఆరు రెట్లు ఎక్కువ కావడం విశేషం. టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన భారత జట్టుకు 2.45 మిలియన్ డాలర్లు (సుమారు రూ.20.42 కోట్లు) అందజేసింది ఐసీసీ. అయితే, బీసీసీఐ అంతకు 600 శాతం (ఆరు రెట్లు) కంటే ఎక్కువ బహుమతిని తన జట్టు టీమిండియాకు ఇచ్చింది. మన జట్టుకు బోర్డు ఏకంగా రూ.125 కోట్లు ఇవ్వనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు.
“ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ గెలిచిన భారత జట్టుకు రూ.125కోట్ల ప్రైజ్‍మనీ ప్రకటిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. టోర్నమెంట్ మొత్తం అసాధారణమైన ప్రతిభ, అంకితభావం, క్రీడాస్ఫూర్తిని, నైపుణ్యాలను జట్టు ప్రదర్శించింది. అద్భుత విజయాన్ని సాధించిన ఆటగాళ్లు కోచ్‍లు, సహాయకసిబ్బంది అందరికీ అభినందనలు” అని జై షా నేడు ట్వీట్ చేశారు.
ఇక టీ20 వరల్డ్ కప్ గెలవగానే అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజాలాంటి సీనియర్లు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. దీంతో టీ20ల్లో కొత్త కెప్టెన్ ఎవరన్న చర్చ మొదలైంది. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ దక్కే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా విఫలమైనా.. కీలకమైన టీ20 వరల్డ్ కప్ లో మాత్రం అతడు సత్తా చాటి విజయంలో కీలకపాత్ర పోషించాడు.
పాండ్యాకు కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి జింబాబ్వేలో ఐదు టీ20ల సిరీస్ ఆడనున్న టీమిండియాకు మాత్రం శుభ్‌మన్ గిల్ కెప్టెన్ గా ఉన్నాడు.