Team India Victory Parade: అట్టహాసంగా టీమిండియా విక్టరీ పరేడ్.. అభిమానుల హోరుతో మోతెక్కిపోయిన సాగర తీరం: వీడియోలు
Team India T20 World Cup Victory Parade: భారత జట్టు విక్టరీ పరేడ్.. ముంబైలో అత్యంత హుషారుగా సాగింది. వేలాది మంది అభిమానులు సాగర తీరంలో ఈ విజయయాత్రకు హాజరయ్యారు. నినాదాలతో మోతెక్కించారు.
టీ20 విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు విజయోత్సవ యాత్ర ముంబైలో అత్యంత గ్రాండ్‍గా జరిగింది. టీ20 ప్రపంచకప్ 2024 ఛాంపియన్లుగా నిలిచిన భారత ఆటగాళ్లు, కోచ్‍లు ఓపెన్ టాప్ బస్‍పై నేడు (జూలై 4) విక్టరీ పరేడ్ నిర్వహించారు. టీ20 ప్రపంచకప్ టైటిల్‍ను అభిమానులకు చూపిస్తూ ప్లేయర్లు ముందుకు సాగారు. 17 ఏళ్ల తర్వాత టీమిండియాకు టీ20 టైటిల్ దక్కడంతో అత్యంత సంతోషంగా సంబరాలు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, జస్‍ప్రీత్ బుమ్రా సహా టీమిండియా ఆటగాళ్లు, హెచ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ దారిపొడవునా అభిమానులకు అభివాదాలు చేశారు. ముంబై సముద్ర తీరం నారిమన్ పాయింట్ వద్ద మొదలైన ఈ విక్టరీ పెరేడ్‍కు వేలాది మంది భారత అభిమానులు హాజరయ్యారు.
మోతెక్కిన సాగరతీరం
టీమిండియా టీ20 ప్రపంచకప్ విక్టరీ పరేడ్‍కు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఇండియా.. ఇండియా, రోహిత్.. రోహిత్, కోహ్లీ.. కోహ్లీ అనే నినాదాలతో మోతెక్కించారు. హార్దిక్ పాండ్యా, జస్‍ప్రీత్ బుమ్రా సహా మరికొందరు ఆటగాళ్ల పేర్లను అరుస్తూ ప్రశంసించారు. వేలాదిగా అభిమానులు రావడంతో ఈ పరేడ్ చాలాసేపు సాగింది. ముంబై సాగర తీరం అభిమానులతో కిక్కిరిసిపోయింది. ప్రేక్షకులు ఆనందంతో హర్షధ్వానాల మోత మోగించారు. కాస్త ఆలస్యంగా ఈ పరేడ్ మొదలైనా అభిమానుల్లో మాత్రం జోష్ ఏ మాత్రం తగ్గలేదు. రహదారులన్నీ అభిమానులతో నిండిపోయాయి. వాంఖడే స్టేడియం వరకు ఈ విక్టరీ పరేడ్ అట్టహాసంగా జరిగింది.
కలిసి టైటిల్ ఎత్తిన విరాట్, రోహిత్
భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఇద్దరూ కలిసి టీ20 ప్రపంచకప్ టైటిల్‍ను ఎత్తారు. వెనుక నిలబడిన రోహిత్‍ను ముందుకు పిలిచాడు విరాట్. ఆ తర్వాత ఇద్దరూ టైటిల్ చేతిలో పట్టుకొని అభిమానులను చూపించారు. గట్టిగా అరిస్తూ సెలెబ్రేట్ చేసుకున్నారు. విక్టరీ పరేడ్‍కు ఇది ఓ హైలైట్‍గా నిలిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.
ఆలస్యంగా మొదలైనా..
వెస్టిండీస్ నుంచి టీమిండియా నేటి ఉదయమే ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని భారత ఆటగాళ్లు కలిశారు. ఆయనతో మాట్లాడారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి ముంబైకు విమానంలో వచ్చాయి. అయితే, విమానం ఆలస్యమవడం, వర్షం పడటంతో విక్టరీ పరేట్ కాస్త ఆలస్యంగా మొదలైంది. అయినా అభిమానులు కోలాహలం ఏ మాత్రం తగ్గలేదు. విశ్వవిజేతలుగా నిలిచిన ఆటగాళ్లకు జయజయధ్వానాలు పలికారు. నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు రహదారి మొత్తం జనాలతో నిండిపోయింది. ప్రత్యేక కార్యక్రమాలు జరిగే వాంఖడే స్టేడియం కూడా కిక్కిరిసిపోయింది.
బార్బడోస్ వేదికగా గత శనివారం (జూన్ 29) జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‍లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించింది. టీ20 టైటిల్ కైవసం చేసుకుంది. 2007 తర్వాత 17 ఏళ్ల అనంతరం మళ్లీ టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ కైవసం చేసుకుంది. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా సహా చాలా మంది భారత ఆటగాళ్లు సంతోషంతో భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా, వెస్టిండీస్‍లో బెరిల్ తుఫాను వల్ల టీమిండియా స్వదేశానికి రావడం ఆలస్యమైంది.