Virat Kohli: లండన్ నుంచి నేరుగా చెన్నైకి విరాట్ కోహ్లీ, 18 నెలల తర్వాత భారత్ గడ్డపై మళ్లీ వైట్ జెర్సీలో దర్శనం-team india star batter virat kohli directly lands in chennai at 4 am from london ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: లండన్ నుంచి నేరుగా చెన్నైకి విరాట్ కోహ్లీ, 18 నెలల తర్వాత భారత్ గడ్డపై మళ్లీ వైట్ జెర్సీలో దర్శనం

Virat Kohli: లండన్ నుంచి నేరుగా చెన్నైకి విరాట్ కోహ్లీ, 18 నెలల తర్వాత భారత్ గడ్డపై మళ్లీ వైట్ జెర్సీలో దర్శనం

Galeti Rajendra HT Telugu
Sep 13, 2024 11:55 AM IST

IND vs BAN Test Series 2024: టీ20 వరల్డ్‌కప్ తర్వాత చాలా రోజులు లండన్‌లో ఎంజాయ్ చేసిన విరాట్ కోహ్లీ.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌ ముంగిట చెన్నైలో అడుగుపెట్టాడు. గత కొంతకాలంగా టెస్టులకి దూరంగా ఉంటున్న కోహ్లీ 18 నెలల తర్వాత మళ్లీ సొంతగడ్డపై టెస్టులు ఆడబోతున్నాడు.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (REUTERS)

India vs Bangladesh 2024: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కోసం చెన్నైలో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అడుగుపెట్టాడు. టీ20 వరల్డ్‌కప్ తర్వాత ఎక్కువగా లండన్‌లోనే ఉంటున్న విరాట్ కోహ్లీ ఈరోజు (శుక్రవారం) ఉదయం 4 గంటలకి చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దిగాడు. అక్కడ నుంచి భారీ భద్రత నడుమ టీమిండియా బస చేసిన హోటల్‌కి విరాట్ కోహ్లీ వెళ్లాడు.

భారత్ గడ్డపై దాదాపు 18 నెలల తర్వాత విరాట్ కోహ్లీ మళ్లీ టెస్టులు ఆడబోతున్నాడు. గత ఏడాది మార్చిలో భారత్‌లో కోహ్లీ చివరి టెస్టు ఆడాడు. బంగ్లాదేశ్‌తో ఈ నెల 19 నుంచి టీమిండియా రెండు టెస్టుల సిరీస్‌ను ఆడనుంది. ఇందులో తొలి టెస్టు మ్యాచ్‌కి చెన్నైలోని చెపాక్ స్టేడియ ఆతిథ్యం ఇవ్వనుంది.

సిరీస్‌కి ముందు చెన్నైలో ఏర్పాటు చేసిన క్యాంప్‌కి ఇప్పటికే కొంత మంది భారత్ క్రికెటర్లు చేరుకున్నారు. దాంతో విరాట్ కోహ్లీ నేరుగా లండన్ నుంచి చెన్నైకి వచ్చాడు. టెస్టు సిరీస్‌ కోసం 16 మందితో కూడిన జట్టుని ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న విరాట్ కోహ్లీ.. ఆ టోర్నీ తర్వాత హాలిడేకి లండన్‌ వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ కోసం వచ్చినా.. మళ్లీ సిరీస్‌ ముగియగానే లండన్‌కి వెళ్లాడు. ఇక అప్పటి నుంచి లండన్‌లోనే విరాట్ కోహ్లీ ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాడు.

ఈ ఏడాది జనవరిలో కోహ్లీ చివరిసారిగా దక్షిణాఫ్రికాలో భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత టీమ్‌లో చాలా మార్పులు వచ్చాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కి కోహ్లీ దూరంగా ఉండిపోయాడు. అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వడంతో ఆ సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ విరామం తీసుకున్నాడు. దాంతో దాదాపు 18 నెలల తర్వాత మళ్లీ సొంతగడ్డపై టెస్టుల్లో ఆడుతున్న విరాట్ కోహ్లీపై అంచనాలు పెరిగిపోయాయి.

బంగ్లాదేశ్‌తో సిరీస్‌ కోసం ఒక్క విరాట్ కోహ్లీ మాత్రమే కాదు.. బుమ్రా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ తదితరులు గురువారమే చెన్నైకి చేరుకున్నారు. రిషబ్ పంత్ 2022 డిసెంబర్‌లో కారు యాక్సిడెంట్‌కి గురై.. కోలుకున్న తర్వాత తొలిసారి టెస్టుల్లో ఆడబోతున్నాడు.

భారత టెస్టు జట్టులో ఆకాష్ దీప్, యశ్ దయాళ్ రూపంలో కొత్త ప్లేయర్లు కూడా ఉన్నారు. అలానే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌తో స్పిన్ త్రయం బలంగా కనిపిస్తోంది. ఇక పేస్ బౌలింగ్ విభాగం బుమ్రా, మహ్మద్ సిరాజ్, యశ్ దయాళ్‌తో దుర్భేద్యంగా కనిపిస్తోంది.

మరోవైపు బంగ్లాదేశ్ టీమ్ నజ్ముల్ హుస్సేన్ శాంటో సారథ్యంలో మంచి ఊపు మీద ఉంది. ఇటీవల పాకిస్థాన్‌ జట్టుపై చారిత్రాత్మక టెస్టు విజయాన్ని సొంతం చేసుకున్న బంగ్లాదేశ్.. భారత్‌లోనూ అదే జోరుని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. గాయపడిన పేసర్ షోరిఫుల్ ఇస్లాం స్థానంలో బంగ్లాదేశ్ టీమ్ జకర్ అలీని తీసుకుంది.

బంగ్లాదేశ్‌తో సిరీస్ తర్వాత టీమిండియా వరుసగా న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్, ఆస్ట్రేలియాలో ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌ను ఆడనుంది.