Ravindra Jadeja: హ్యాపీ రిటైర్‌మెంట్ అంటూ జడేజాకు ఫ్యాన్స్ విషెస్ - క్రికెట్‌కు టీమిండియా స్పిన్నర్ గుడ్‌బై?
Ravindra Jadeja: టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన జెర్సీ ఫొటోను రవీంద్ర జడేజా పంచుకోవడంతో ఈ రిటైర్‌మెంట్ పుకార్లు మొదలయ్యాయి. హ్యాపీ రిటైర్‌మెంట్ డే అంటూ అభిమానులు జడేజాకు విషెస్ చెబుతోన్నారు.
అశ్విన్ బాటలోనే టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో జడేజా చేసిన ఓ పోస్ట్ రిటైర్‌మెంట్ వార్తలకు బలాన్ని చేకూర్చుతోంది. జడేజా రిటైర్‌మెంట్ ప్రకటించడం ఖాయంగానే కనిపిస్తోందని క్రికెట్ వర్గాలతో పాటు అభిమానులు చెబుతోన్నారు.
జెర్సీ ఫొటో...
ఇన్‌స్టాగ్రామ్‌లో తన జెర్సీ నంబర్ 8 ఫొటోను పోస్ట్ చేశాడు జడేజా. ఈ ఫొటోకు ఎలాంటి క్యాప్షన్ జోడించలేదు. కేవలం జెర్సీ ఫొటోను మాత్రమే జడేజా షేర్ చేశాడు. జడేజా జెర్సీ ఫొటోతో రిటైర్‌మెంట్ పుకార్లు మొదలయ్యాయి. హ్యాపీ రిటైర్‌మెంట్ డే అంటూ అభిమానులు అప్పుడే జడేజాకు విషెస్ చెప్పడం మొదలుపెట్టారు. రిటైర్‌మెంట్ ప్రకటించాలనే ఆలోచనతోనే జడేజా జెర్సీ ఫొటోను షేర్ చేసినట్లు చెబుతోన్నారు.
2023లో చివరి వన్డే...
ఇప్పటికే టీ20లకు గుడ్‌బై చెప్పిన జడేజా కేవలం వన్డేలతో పాటు టెస్టులు మాత్రమే ఆడుతున్నాడు. వన్డే జట్టులో జడేజా చోటు కోల్పోయి చాలా కాలమైంది. టీమిండియా తరఫున 2023 నవంబర్‌లో చివరి వన్డే మ్యాచ్ ఆడాడు జడేజా. టెస్టుల్లో మాత్రం జడేజాను టీమ్ మేనేజ్‌మెంట్ కొనసాగిస్తూవస్తోంది. అయితే ఇటీవల జరిగిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లలో జడేజా దారుణంగా విఫలమయ్యాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ తేలిపోయాడు.
నాలుగు వికెట్లు మాత్రమే...
బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో నాలుగు టెస్టులు ఆడిన జడేజా కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. బ్యాటింగ్‌లో 135 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో 3-1 తేడాతో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది.ఈ ఓటమి నేపథ్యంలో టీమిండియాసీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో పాటు జడేజాపై దారుణంగా విమర్శలొచ్చాయి.
ఐపీఎల్‌లో కంటిన్యూ...
ఈ విమర్శల నేపథ్యంలో టెస్ట్ జట్టులో జడేజాకు స్థానం దక్కడం కష్టంగా మారింది. దాంతో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు జడేజా గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్‌లో మాత్రం జడేజా కొనసాగనున్నాడు. 18 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రిటైన్ చేసుకున్నది.
నాలుగు సెంచరీలు...
టీమిండియా తరఫున 197 వన్డేలు, 80 టెస్టులతో పాటు 74 టీ20 మ్యాచ్‌లు ఆడాడు జడేజా. వన్డేల్లో పదమూడు హాఫ్ సెంచరీలతో 2756 పరుగులు చేశాడు. 220 వికెట్లు తీసుకున్నాడు. టెస్టుల్లో 3370 రన్స్ సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్లుల్లో 323 వికెట్లు తీసుకున్నాడు. టీ20ల్లో 515 రన్స్, 54 వికెట్లు తీశాడు జడేజా.