Kuldeep Yadav: కుల్దీప్ యాదవ్‌పై నెటిజన్ వెటకారం, ఘాటుగా రిప్లై ఇచ్చిన భారత క్రికెటర్
2023 World Cup: గత ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్ జట్టు ఓటమికి కుల్దీప్ యాదవ్‌ను కారణంగా చూపుతూ ఒక నెటిజన్ చేసిన కామెంట్‌కి.. ఈ మణికట్టు స్పిన్నర్ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు.
భారత్ జట్టు గత ఏడాది వన్డే ప్రపంచకప్‌ని గెలిచే అవకాశాన్ని ఆఖర్లో చేజార్చుకుంది. సరిగ్గా ఏడాది క్రితం భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే ప్రపంచకప్ -2023 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరిగింది. ఆ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులకి ఆలౌటవగా.. లక్ష్యాన్ని ఆస్ట్రేలియా టీమ్ 43 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించేసింది.
ఆ వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి ఏడాది సందర్భంగా సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించి ఓ నెటిజన్ అభ్యంతర కామెంట్స్ చేయగా.. క్రికెటర్ కూడా ఘాటుగా రిప్లై ఇచ్చారు.
ఫైనల్లో తేలిపోయిన కుల్దీప్
వాస్తవానికి ఆ మెగా టోర్నీలో కుల్దీప్ యాదవ్ ఫైనల్ వరకూ నిలకడగా రాణించాడు. గ్రూప్ దశ, నాకౌట్ మ్యాచ్ ల్లో భారత్ విజయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాడు. కానీ.. ఫైనల్లో మాత్రం 10 ఓవర్లు వేసి 56 పరుగులిచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దాంతో వరల్డ్‌కప్ ఓడిపోవడానికి కుల్దీప్ యాదవ్‌ను కారణంగా చూపుతూ నెటిజన్ అభ్యంతకర కామెంట్స్ చేశాడు.
నాతో శత్రుత్వం ఏమైనా ఉందా?
నెటిజన్‌పై కుల్దీప్ యాదవ్ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు ‘‘అవును జీ మీకేం ప్రాబ్లమ్.. ఇంత క్యూట్‌గా రాసినందుకు డబ్బులు తెచ్చుకోండి. నాతో మీకు ఏదైనా వ్యక్తిగత శత్రుత్వం ఉందా?’’ అని కుల్దీప్ యాదవ్ రిప్లై ఇచ్చాడు.
వన్డే ప్రపంచకప్ -2023లో భారత్ జట్టు వరుస విజయాలు సాధిస్తూ ఫైనల్‌కి చేరింది. కానీ.. తుది పోరులో ఆస్ట్రేలియా ముందు తేలిపోయింది. టోర్నీలో ఫైనల్ వరకూ బంతితో మ్యాజిక్ చేసిన కుల్దీప్.. టైటిల్ పోరులో చేతులెత్తేశాడు.
టెస్టు జట్టులో ఉన్నా?
భారత టెస్టు జట్టుతో ఉన్నా కుల్దీప్ యాదవ్‌కి రెగ్యులర్‌గా అవకాశాలు దక్కడం లేదు. అలానే అతను టీ20 మ్యాచ్‌లు ఆడి చాలా రోజులైపోయింది. వన్డేల్లోనూ ఈ స్పిన్నర్‌ని సెలెక్టర్లు పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదు.
భారత్ తరఫున ఇప్పటి వరకు కుల్దీప్ యాదవ్ 13 టెస్టులు, 106 వన్డేలు, 40 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో మొత్తం 297 వికెట్లను కుల్దీప్ యాదవ్ పడగొట్టాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్ టెస్టు జట్టు ఈ నెల 22 నుంచి ఐదు టెస్టుల సిరీస్‌ను అక్కడ ఆడనుంది.