IND vs BAN 2nd Test: సిరాజ్ స్థానంలో స్పిన్నర్!.. సర్ఫరాజ్‍కు మళ్లీ నో ప్లేస్.. రెండో టెస్టులో భారత్ తుది జట్టు ఇలా!
IND vs BAN 2nd Test: బంగ్లాదేశ్‍తో రెండో టెస్టు కోసం తుది జట్టులో భారత మార్పులు చేసే అవకాశం ఉంది. కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27న ఈ మ్యాచ్ షురూ కానుంది. క్లీన్‍స్వీప్ లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగనుంది. ఈ రెండో టెస్టులో భారత తుది జట్టు ఎలా ఉండే అవకాశం ఉందో ఇక్కడ చూడండి.
బంగ్లాదేశ్‍పై తొలి టెస్టులో అదిరే విజయం సాధించిన భారత్ ఫుల్ జోష్‍లో ఉంది. రెండో టెస్టులోనూ గెలిచి 2-0తో సిరీస్‍ను క్లీన్‍స్వీప్ చేయాలని ఆశతో ఉంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు ఈ శుక్రవారం (సెప్టెంబర్ 27) షురూ కానుంది. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో ఈ మ్యాచ్ సాగనుంది. తొలి టెస్టుతో పోలిస్తే ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో మార్పు ఉండే అవకాశం ఉంది.
చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బ్యాటర్లు విఫలమైనా.. లోయర్ ఆర్డర్లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అదరగొట్టి ఆదుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‍మన్ గిల్, రిషబ్ పంత్ సెంచరీల మోత మెగించారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టి అశ్విన్ అదరగొట్టాడు. మొత్తంగా భారత్ 280 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ రెండో టెస్టులోనూ సత్తాచాటాలని టీమిండియా కసిగా ఉంది. కాన్పూర్ పరిస్థితులకు తగ్గట్టు తుది జట్టులో ఓ మార్పు చేసే అవకాశం ఉంది.
రాహుల్‍కే ఛాన్స్
తొలి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ నిరాశపరిచారు. కేఎల్ రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో ఔటయ్యాడు. దీంతో రాహుల్ ప్లేస్‍లో సర్ఫరాజ్ ఖాన్‍ను తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, రెండో టెస్టులోనూ రాహుల్‍కే తుది జట్టులో అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయి. హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ అతడిపై చాలా నమ్మకంతో ఉన్నారు. దీంతో బ్యాటింగ్ ఆర్డర్లో పెద్దగా మార్పులు ఉండవు.
సిరాజ్ ప్లేస్‍లో స్పిన్నర్!
రెండో టెస్టు జరిగే కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ పిచ్ స్లోగా ఉంటూ స్పిన్‍కు ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంది. దీంతో తుది జట్టులో అదనపు స్పిన్నర్‌ను తీసుకోవాలని టీమిండియా మేనేజ్‍మెంట్ భావిస్తోంది. పేసర్ మహమ్మద్ సిరాజ్‍ను తప్పించి కుల్దీప్ యాదవ్‍ను తీసుకోవాలని ఆలోచిస్తోంది. అక్షర్ పటేల్ కూడా మరో ఆప్షన్‍గా ఉన్నా కుల్దీప్‍కే మొగ్గు చూపే అవకాశం ఉంది. లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా జడేజా ఉండటంతో అక్షర్ బెంచ్‍కే పరిమితం కానున్నాడు.
పేసర్లుగా జస్‍ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ ఉంటారు. చెన్నై టెస్టులో ఆకాశ్ ఇంప్రెస్ చేశాడు. లైన్ విషయంలో సిరాజ్ కాస్త తడబడ్డాడు. దీంతో రెండో టెస్టుకు ఆకాశ్‍ను కొనసాగించాలని టీమిండియా అనుకుంటోంది. అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్‍తో స్పిన్ విభాగం మరింత బలంగా ఉండనుంది.
బంగ్లాతో రెండో టెస్టులో భారత తుదిజట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‍మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, జస్‍ప్రీత్ బుమ్రా
ఈ రెండో టెస్టుకు తొలి రెండు రోజులు వర్షం ఆటంకాలు కలిగించే అవకాశాలు ఉన్నాయి. వాతావరణ రిపోర్టుల ప్రకారం సెప్టెంబర్ 27, 28 తేదీల్లో కాన్పూర్‌లో వర్షం పడే అవకాశాలు 60 శాతానికి పైగానే ఉన్నాయి. కాగా, ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు కాన్పూర్ చేరుకున్నారు.