Team India Batting Coach: ఆస్ట్రేలియా పర్యటనలో దారుణమైన ఓటమితో కంగుతిన్న టీమిండియాకు కొత్తగా బ్యాటింగ్ కోచ్ ను నియమించింది బీసీసీఐ. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నా.. బోర్డు మాత్రం అతన్ని పట్టించుకోలేదు. సౌరాష్ట్ర మాజీ ప్లేయర్ సితాన్షు కోటక్ కు ఆ బాధ్యతలు అప్పగించింది.
టీమిండియాకు కొత్త బ్యాటింగ్ కోచ్ వచ్చేశాడు. సౌరాష్ట్ర మాజీ క్రికెటర్ సితాన్షు కోటక్ ను బీసీసీఐ నియమించింది. జనవరి 22 నుంచి ఇంగ్లండ్ తో వైట్ బాల్ సిరీస్ ప్రారంభానికి ముందే అతడు కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, ఫీల్డింగ్ కోచ్ గా దిలీప్, ఇద్దరు అసిస్టెంట్ కోచ్ లు అభిషేక్ నాయర్, రియాన్ టెన్ డస్కాటే ఉన్నారు. అయితే ప్రత్యేకంగా బ్యాటింగ్ కోచ్ మాత్రం లేడు.
ఈ మధ్యే ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలి సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో బ్యాటింగ్ కోచ్ ను నియమించింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో వచ్చిన రిపోర్టు ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే సితాన్షు కోటక్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. అంతకుముందు స్వదేశంలో ఇంగ్లండ్ తో వన్డే, టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం జనవరి 18న టీమ్ కోల్‌కతాలో మూడు రోజుల క్యాంప్ కోసం వెళ్లనుంది.
సితాన్షు కోటక్ సౌరాష్ట్ర టీమ్ మాజీ కెప్టెన్. ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ లెజెండరీ ప్లేయర్స్ లో సితాన్షు ఒకరు. 1992 నుంచి 2013 మధ్య ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాడు. 130 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 47.16 సగటుతో 8061 రన్స్ చేశాడు. అందులో 15 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక లిస్ట్ ఎ క్రికెట్ లో 42.33 సగటుతో 3083 రన్స్ చేశాడు.
రిటైరైన తర్వాత సౌరాష్ట్ర జట్టుకే కోచ్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడెమీలో బ్యాటింగ్ కోచ్ గా చేశాడు. ఒకప్పటి ఐపీఎల్ టీమ్ గుజరాత్ లయన్స్ కు అసిస్టెంట్ కోచ్ గా పని చేశాడు. గత నాలుగేళ్లుగా ఇండియా ఎ బ్యాటింగ్ కోచ్ గా ఉన్నాడు. ఆగస్ట్ 2023లో ఐర్లాండ్ తో టీ20 సిరీస్ సమయంలోనూ తాత్కాలికంగా టీమిండియా హెడ్ కోచ్ గా వ్యవహరించడం విశేషం.
టాపిక్