Sehwag on Team India: రింకు, సూర్యలాంటి ప్లేయర్స్ మనకు మరింత మంది కావాలి.. అప్పుడే క్రికెట్‌ను శాసిస్తాం: సెహ్వాగ్
Sehwag on Team India: రింకు, సూర్యలాంటి ప్లేయర్స్ మనకు మరింత మంది కావాలి.. అప్పుడే క్రికెట్‌ను శాసిస్తాం అని సెహ్వాగ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Sehwag on Team India: రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్.. ఇండియన్ క్రికెట్ టీమ్ లో టీ20 క్రికెట్ ఆడే తీరునే మార్చేసిన క్రికెటర్లు వీళ్లు. ఇలాంటి ప్లేయర్స్ మరింత మంది టీమ్ లోకి వస్తేనే ఇండియా మరింత ప్రమాదకర జట్టుగా మారుతుందని అన్నాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. ఏషియన్ గేమ్స్ లో భాగంగా నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో చివర్లో వచ్చి రింకు సింగ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే.
రింకు ఆడిన ఈ ఇన్నింగ్స్ చూసిన తర్వాత సెహ్వాగ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ లో రింకు సింగ్ కేవలం 15 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. అందులో 4 సిక్స్ లు, 2 ఫోర్లు ఉన్నాయి. అతని మెరుపు ఇన్నింగ్స్ తో ఇండియా స్కోరు 200 దాటింది. అంతకుముందు యశస్వి జైస్వాల్ కూడా కేవలం 48 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
ఈ ఇన్నింగ్స్ చూసిన తర్వాత వీరూ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఒకేలా ఆడే ఎంతో మంది బ్యాటర్లు ఉన్నారని, వాళ్ల వల్ల లాభం లేదని వీరూ తేల్చేశాడు. "ఒకే స్పీడుతో ఆడే చాలా మంది బ్యాటర్లు మన దగ్గర ఉన్నారని నాకు అనిపిస్తుంది. కానీ టాప్ గేర్ లో ఆడే విధ్వంసకర బ్యాటర్లను మనం తయారు చేయాలి. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో. రింకు, స్కై (సూర్యకుమార్) మోడ్‌లోని ప్లేయర్స్ కావాలి. అలా అయితే మనది మరింత ప్రమాదరకర జట్టుగా మారుతుంది" అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
తాను ఆడే రోజుల్లో ఇలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్ ఎన్నో చూపించాడు సెహ్వాగ్. టెస్ట్ క్రికెట్ ను కూడా టీ20 మాదిరిగా ఆడుతూ రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన ఏకైక ఇండియన్ బ్యాటర్ అతడు. అలాంటి ప్లేయర్ నుంచి ఇలాంటి కామెంట్స్ రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. నిజానికి వీరూ చెప్పింది వంద శాతం నిజమనడంలో సందేహం లేదు.
టీ20 క్రికెట్ లో దూకుడుగా ఆడే బ్యాటర్లు ప్రస్తుతం ఇండియన్ టీమ్ కు అవసరం. చివర్లో వచ్చి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసే సత్తా ఉన్న ప్లేయర్స్ సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్. ఇలాంటి ప్లేయర్స్ మరింత మంది జట్టులోకి రాగలిగితే.. టీ20ల్లో ఇండియాకు తిరుగుండదు.