Champions Trophy: బయలుదేరిన భారత క్రికెట్ వీరులు.. ఛాంపియన్స్ ట్రోఫీతో రావడమే లక్ష్యం.. విజయీభవ!
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు టీమ్ఇండియా బయలుదేరి వెళ్లింది. కెప్టెన్ రోహిత్, కోహ్లి లాంటి స్టార్ ఆటగాళ్లతో సహా జట్టు ముంబయి నుంచి దుబాయ్ కు వెళ్లింది.

ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడటమే లక్ష్యంగా భారత క్రికెట్ వీరులు బయలుదేరి వెళ్లారు. ఈ ఐసీసీ టైటిల్ ను స్వదేశానికి తీసుకురావాలనే పట్టుదలతో పయనమయ్యారు. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ల కోసం శనివారం (ఫిబ్రవరి 15) టీమ్ఇండియా ముంబయి నుంచి దుబాయ్ కు వెళ్లింది. కెప్టెన్ రోహిత్, కోహ్లి తదితర ఆటగాళ్లు ముంబయి ఎయిర్ పోర్ట్ లో కనిపించారు.
ఆటగాళ్లు సై
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత ఆటగాళ్లు సై అంటున్నారు. పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీలో తమ మ్యాచ్ లను భారత్ దుబాయ్ లో ఆడబోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 19న ఈ టోర్నీ ఆరంభమవుతుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో భారత్ తొలి మ్యాచ్ ఆడుతుంది. ఈ టోర్నీ కోసం కోహ్లి, రోహిత్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, కుల్ దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి తదితరులు దుబాయ్ బయలుదేరారు.
గంభీర్ గ్రూప్ కూడా
టీమ్ఇండియా కోచింగ్ గ్రూప్ కూడా ఆటగాళ్లతో పాటు దుబాయ్ కు స్టార్ట్ అయింది. ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటె తో కలిసి హెడ్ కోచ్ గంభీర్ విమానమెక్కాడు.
స్వదేశంలో వన్డే సిరీస్ లో ఇంగ్లండ్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన జోరుతో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీకి బయలుదేరింది. తిరిగి ట్రోఫీతో భారత గడ్డపై జట్టు అడుగుపెట్టాలన్నది 140 కోట్ల జనాల ఆకాంక్ష. టీమ్ఇండియా.. విజయూభవ!