Team India in Delhi: టీమిండియా వచ్చేసింది.. వరల్డ్ కప్ ట్రోఫీతో సగర్వంగా ఢిల్లీలో అడుగుపెట్టిన రోహిత్ సేన
Team India in Delhi: టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో టీమిండియా వచ్చేసింది. గురువారం తెల్లవారుఝామున రోహిత్ సేన న్యూఢిల్లీలో ల్యాండైంది. టీమ్ కు ఎయిర్ పోర్టు దగ్గర భారీ సంఖ్యలో అభిమానులు వెల్కమ్ చెప్పారు.
Team India in Delhi: టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఐదు రోజుల తర్వాత స్వదేశంలో అడుగుపెట్టింది. బార్బడోస్ లో హరికేన్ కారణంగా మూడు రోజుల పాటు అక్కడే చిక్కుకుపోయిన టీమ్.. చివరికి బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో గురువారం (జులై 4) తెల్లవారుఝామున న్యూఢిల్లీలో ల్యాండైంది. వాళ్లకు అక్కడ ఘన స్వాగతం లభించింది.
ఇంటికి వచ్చేసిన వరల్డ్ కప్ ట్రోఫీ
వరల్డ్ కప్ ట్రోఫీ ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా అని ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలిచిన రోహిత సేన.. సగర్వంగా ఆ ట్రోఫీతో ఇండియాలో ల్యాండైంది. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు మిగిలిన టీమ్ సభ్యులంతా ట్రోఫీతో ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాగా ఉదయం నుంచి అక్కడే వేచి చూస్తున్న వందలాది మంది అభిమానులు.. ఘనంగా స్వాగతం పలికారు.
రోహిత్ శర్మ ట్రోఫీ పట్టుకొని బయటకు వచ్చాడు. ఎయిర్ పోర్టు నుంచి టీమ్ నేరుగా ఐటీసీ మౌర్య హోటల్ కు వెళ్లింది. అక్కడ టీమ్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఓ పెద్ద కేక్ ను ప్రత్యేకంగా తయారు చేశారు. ఇండియన్ టీమ్ జెర్సీ రంగుల్లో ఉన్న ఆ కేకుపైన చాక్లెట్ తో తయారు చేసిన వరల్డ్ కప్ ట్రోఫీ నమూనాను ఉంచడం విశేషం.
టీమిండియా షెడ్యూల్ ఇదీ
నాలుగు రోజుల తర్వాత స్వదేశానికి వచ్చిన టీమిండియా గురువారమంతా బిజీ బిజీగా గడపనుంది. ఉదయం 9.30 గంటలకు టీమ్ ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్లనుంది. అక్కడ మోదీకి వరల్డ్ కప్ అందించిన తర్వాత ఫొటో సెషన్ ఉంటుంది. ఆ తర్వాత టీమ్ నేరుగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తుంది. అక్కడి వాంఖెడే స్టేడియం దగ్గర కిలోమీటర్ పాటు విక్టరీ పరేడ్ నిర్వహించనున్నారు.
టీమిండియా విక్టరీ పరేడ్ సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. “మీ అందరితో ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని మేం ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాం. జూలై 4న సాయంత్రం 5 గంటలకు మెరైన్ డ్రైవ్, వాంఖడే వద్ద ఈ విజయాన్ని విక్టరీ పెరేడ్‍తో సెలెబ్రేట్ చేసుకుందాం” అని రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు. టీమిండియా విక్టరీ పరేడ్‍ను స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ చూడొచ్చు.
ఈ పరేడ్ కు పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు ఓపెన్ ఇన్విటేషన్ పంపించాడు. పరేడ్ తర్వాత ఇండియన్ టీమ్ కు వాంఖడే స్టేడియంలోనే సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ప్లేయర్స్ అందరూ అక్కడి నుంచే ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోనున్నారు. ఓవైపు వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ స్వదేశానికి రాగా.. మరోవైపు మరో టీమిండియా జింబాబ్వే వెళ్లిన విషయం తెలిసిందే.