Team India in Mumbai: హీరోలు వచ్చేశారు.. ముంబైలో అడుగుపెట్టిన ఆసియా కప్ ఛాంపియన్స్
Team India in Mumbai: హీరోలు వచ్చేశారు. ముంబైలో అడుగుపెట్టారు ఆసియా కప్ ఛాంపియన్స్ టీమిండియా. ఆదివారం (సెప్టెంబర్ 17) రాత్రి శ్రీలంకపై గెలిచిన ఇండియన్ టీమ్.. సోమవారం తెల్లవారుఝామునే ముంబై వచ్చేసింది.
Team India in Mumbai: ఆసియా కప్ ఛాంపియన్స్ టీమిండియా స్వదేశానికి తిరిగి వచ్చింది. ఆదివారం (సెప్టెంబర్ 17) జరిగిన ఫైనల్లో శ్రీలంకను చిత్తు చిత్తుగా ఓడించి 8వసారి టైటిల్ గెలిచిన రోహిత్ సేన.. సోమవారం తెల్లవారుఝామునే ముంబై ఎయిర్ పోర్టులో అడుగుపెట్టింది. టీమ్ లోని ప్లేయర్స్ అందరూ ప్రత్యేక విమానంలో వచ్చారు.
మొదట విరాట్ కోహ్లి ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్లిపోయాడు. తర్వాత హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ, బుమ్రా, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్.. ఇలా ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. టీమ్ ను చూడటానికి ఉదయాన్నే పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అయితే ప్లేయర్స్ ఎవరూ అక్కడున్న మీడియా, ఫ్యాన్స్ ను కలవకుండానే వెళ్లిపోయారు.
ఆసియా కప్ ఫైనల్ కొలంబోలో జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో శ్రీలంకను 50 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా.. తర్వాత 6.1 ఓవర్లలోనే టార్గెట్ చేజ్ చేసి 10 వికెట్లతో గెలిచింది. ఆసియా కప్ ఇండియా గెలవడం ఇది 8వసారి. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇది రెండోసారి. 2018లోనూ తాత్కాలిక కెప్టెన్ గా ఉన్న రోహిత్.. ఇండియాకు టైటిల్ సాధించి పెట్టాడు.
వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఇండియా ఆత్మవిశ్వాసాన్ని ఈ విజయం రెట్టింపు చేస్తుంది. అయితే ఆ మెగాటోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ కూడా ఇండియా ఆడనుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 22, 24, 27వ తేదీల్లో ఈ మ్యాచ్ లు జరుగుతాయి. దీంతో ప్లేయర్స్ పెద్దగా రెస్ట్ లేకుండానే మరో సిరీస్ ఆడనున్నారు.
ఇక సెప్టెంబర్ 29 నుంచి వరల్డ్ కప్ వామప్ మ్యాచ్ లు కూడా ప్రారంభం అవుతున్నాయి. అక్టోబర్ 5 నుంచి మెగా టోర్నీ మొదలవుతుంది. ఇండియా అక్టోబర్ 8న తన తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.