Team India: పుజారా కావాలన్న గంభీర్.. కుదరదన్న సెలెక్టర్లు.. తాత్కాలిక కెప్టెన్‌గా ఆ సీనియర్ ప్లేయర్!
Team India: టీమిండియా బ్యాటింగ్ కష్టాల నేపథ్యంలో సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా కావాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు తాత్కాలిక కెప్టెన్ గా ఉండటానికి జట్టులోని ఓ సీనియర్ ప్లేయర్ సిద్ధమైనట్లు కూడా సమాచారం.
Team India: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగో టెస్టులో అనూహ్యంగా ఓడిన టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత వరుస షాక్‌లు తగులుతున్న నేపథ్యంలో అతనిపైనా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో గంభీర్, టీమ్ మేనేజ్‌మెంట్ మధ్య కూడా విభేదాలు తారస్థాయికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో వచ్చిన రిపోర్టు ప్రకారం.. సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా కావాలని గంభీర్ కోరగా.. సెలెక్టర్లు తిరస్కరించారట.
పుజారా కావాలన్న గంభీర్.. కుదరదన్న సెలెక్టర్లు
టీమిండియాపై క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతుల్లో వైట్ వాష్ కావడం, తర్వాత ఆస్ట్రేలియాలోనూ నాలుగో టెస్టులో డ్రా చేసుకునే అవకాశం ఉన్నా ఓడిపోవడంతో టీమ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో హెడ్ కోచ్ గంభీర్ లో అసహనం పెరిగిపోతోంది. మెల్‌బోర్న్ ఓటమి తర్వాత టీమ్ సభ్యులపై అతడు అరిచేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా అతడు వెటరన్ బ్యాటర్ పుజారాను తీసుకోవాల్సిందిగా కోరగా.. సెలెక్టర్లు మాత్రం నో చెప్పినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు తెలిపింది.
టాపార్డర్ వరుస వైఫల్యాలు.. రోహిత్, కోహ్లి లాంటి సీనియర్లు చేతులెత్తేస్తుండటంతో ఆస్ట్రేలియాలో మంచి రికార్డు ఉన్న పుజారాను మళ్లీ తీసుకురావాలని గంభీర్ పట్టుదలగా ఉన్నాడు. అయితే పుజారా మాత్రం 2023 డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత మళ్లీ టీమ్ లోకి రాలేదు. కానీ ఆస్ట్రేలియా గడ్డపై మాత్రం పుజారా 11 టెస్టుల్లో 993 రన్స్ చేశాడు. ఇదే గంభీర్ ను అతని వైపు చూసేలా చేసింది. కానీ సెలెక్టర్లు మాత్రం అందుకు సిద్ధంగా లేరు.
సీనియర్ ప్లేయర్‌కు తాత్కాలిక కెప్టెన్సీ
మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ వరుస వైఫల్యాలు అతని రిటైర్మెంట్ ను సూచిస్తున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత రోహిత్.. టెస్టులకు కూడా గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అతడు టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఒకవేళ రోహిత్ రిటైర్ అయితే కొత్త కెప్టెన్ ఎవరన్న చర్చ కూడా జరుగుతోంది. జట్టులోని యువ ప్లేయర్స్ ఇంకా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో ఓ సీనియర్ ప్లేయర్ తాత్కాలిక కెప్టెన్ కావడానికి అంగీకరించినట్లు కూడా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు తెలిపింది. ఆ ప్లేయర్ ఎవరన్న విషయం మాత్రం వెల్లడించలేదు.
ఆస్ట్రేలియాలో పుజారా రికార్డు ఇలా
రాహుల్ ద్రవిడ్ రిటైర్ అయిన తర్వాత టెస్టు జట్టులో అతని స్థానాన్ని భర్తీ చేసిన ప్లేయర్ చెతేశ్వర్ పుజారా. నయా వాల్ గా పేరుగాంచిన అతడు.. వరుస వైఫల్యాలతో జట్టుకు దూరమయ్యాడు. అయితే ఆస్ట్రేలియాలో మాత్రం పుజారాకు మంచి రికార్డు ఉంది. 2018-19 సిరీస్ లో అతడు 521 రన్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతడు జట్టులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లు కూడా కాస్త ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుందని గంభీర్ భావిస్తున్నాడు.
మూడో స్థానంలో నిలకడైన బ్యాటర్ ప్రస్తుతం జట్టులో లేడు. శుభ్‌మన్ గిల్ వరుసగా విఫలమవుతున్నాడు. ఆ స్థానంలో నాలుగో టెస్టులో కేఎల్ రాహుల్ వచ్చినా.. అతడూ నిరాశ పరిచాడు. దీంతో పుజారాను మళ్లీ తీసుకురావడం మంచిదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా టీమ్ ప్రదర్శనపై గంభీర్ తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో జట్టులో భారీ మార్పులు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.