Team India: టీమిండియాకు మరో దెబ్బ.. రెండు డబ్ల్యూటీసీ పాయింట్లు కోత పెట్టిన ఐసీసీ-team india docked two wtc points after loss against south africa ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India: టీమిండియాకు మరో దెబ్బ.. రెండు డబ్ల్యూటీసీ పాయింట్లు కోత పెట్టిన ఐసీసీ

Team India: టీమిండియాకు మరో దెబ్బ.. రెండు డబ్ల్యూటీసీ పాయింట్లు కోత పెట్టిన ఐసీసీ

Hari Prasad S HT Telugu
Dec 29, 2023 02:37 PM IST

Team India: సౌతాఫ్రికా చేతుల్లో ఇన్నింగ్స్ తేడాతో ఓడిన టీమిండియాకు మరో దెబ్బ పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజుతోపాటు డబ్ల్యూటీసీ పాయింట్లలోనూ కోత విధించింది ఐసీసీ.

కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (PTI)

Team India: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన టీమిండియాకు ఐసీసీ మరో షాకిచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ప్రతి ప్లేయర్ 10 శాతం మ్యాచ్ ఫీజుతోపాటు రెండు డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత పెట్టింది. ఈ ఓటమి తర్వాత తొలి స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయిన ఇండియన్ టీమ్‌కు ఇది గట్టి దెబ్బే అని చెప్పాలి.

yearly horoscope entry point

మ్యాచ్ ఫీజుతో పెద్దగా నష్టం లేదు కానీ.. డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత పెట్టడం మాత్రం టీమిండియాకు మింగుడు పడనిదే. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో నిర్ణీత సమయంలో రెండు ఓవర్లు తక్కువగా వేసింది. "రోహిత్ శర్మ జట్టుకు రెండు డబ్ల్యూటీసీ పాయింట్లు కట్ చేశాం. అదే సమయంలో ప్రతి ప్లేయర్ మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధించాం" అని ఐసీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈ మ్యాచ్ కు రిఫరీగా వ్యవహరించిన క్రిస్ బ్రాడ్.. టీమిండియా రెండు ఓవర్లు తక్కువగా వేసినట్లు గుర్తించి ఈ జరిమానా విధించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ తన తప్పిదాన్ని అంగీకరించినట్లు ఐసీసీ తెలిపింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయంలో తక్కువగా వేసే ప్రతి ఓవర్ కు ప్లేయర్ మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత విధిస్తారు.

సౌతాఫ్రికాతో మ్యాచ్ ఓటమి తర్వాత 16 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న టీమిండియా.. తాజాగా రెండు పాయింట్లు కోత పెట్టడంతో ఆరోస్థానానికి పడిపోయింది. 14 పాయింట్లు, 38.89 పాయింట్ల పర్సెంటేజ్ తో ఇండియన్ టీమ్ ఆరో స్థానానికి పరిమితమైంది. తొలి టెస్టులో మూడు రోజుల్లోనే ఇండియన్ టీమ్ చేతులెత్తేసిన విషయం తెలిసిందే.

తొలి ఇన్నింగ్స్ లో 245, రెండో ఇన్నింగ్స్ లో 131 పరుగులకే ఇండియా ఆలౌటైంది. మరోవైపు బౌలర్లు కూడా విఫలమవడంతో తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 408 పరుగులు చేసి భారీ ఆధిక్యం సంపాదించింది. ఈ ఓటమితో సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలన్న కల కలగానే మిగిలిపోయింది.

Whats_app_banner