Suryakumar Yadav: హార్దిక్ అతిపెద్ద బలహానత అదే.. అందుకే అతన్ని కాదని సూర్యకు కెప్టెన్సీ ఇచ్చా: చీఫ్ సెలక్టర్ అగార్కర్
Suryakumar Yadav: టీమిండియా టీ20 కెప్టెన్సీ హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్‌కు ఇవ్వడం వెనుక కారణమేంటో వెల్లడించాడు సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్. ఈ సందర్భంగా హార్దిక్ అదిపెద్ద బలహీనత ఏంటో చెప్పాడు.
Suryakumar Yadav: టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పుకున్న తర్వాత ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో అన్న ఆసక్తి అభిమానుల్లో కనిపించింది. టీ20 వరల్డ్ కప్ లో వైస్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాకే కెప్టెన్సీ దక్కుతుందని భావించిన చివరి నిమిషంలో సూర్యకుమార్ ను కెప్టెన్ గా నియమించారు. అయితే దీని వెనుక కారణమేంటన్నది తాజాగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు.
హార్దిక్‌కు అందుకే కెప్టెన్సీ ఇవ్వలేదు
హార్దిక్ పాండ్యా టీమ్ లో సూర్య కంటే ముఖ్యమైన ప్లేయర్. 3 వన్డేలు, 16 టీ20ల్లో కెప్టెన్ గా ఉన్నాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్ జట్లకు కూడా సారథ్యం వహించాడు.ఆ లెక్కన చూస్తే హార్దిక్ కే కెప్టెన్సీ దక్కాలని చాలా మంది భావించారు. కానీ సెలక్టర్లు, హెడ్ కోచ్ గంభీర్ ఆలోచన మాత్రం మరోలా ఉంది. దీని వెనుక ఉన్న కారణాన్ని అగార్కర్ వివరించే ప్రయత్నం చేశాడు.
"హార్దిక్ చాలా ముఖ్యమైన ప్లేయర్. అతనికి ఉన్న నైపుణ్యాలు అంత సులువుగా మనకు దక్కవు. గత రెండేళ్లుగా అతని ఫిట్‌నెసే ప్రధాన సవాలుగా మారింది. ఇలాంటి సమయంలో ఓ కోచ్, సెలక్టర్ కు ఇది కఠినమైన సమయం. 2026 వరల్డ్ కప్ వరకు మేము కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్నాం. అదే ప్రధాన సవాలు. ఆ ఆలోచన వెనుక కారణం అదే. అన్ని సమయాల్లో అందుబాటులో ఉండే వ్యక్తి కోసం చూశాం" అని శ్రీలంక పర్యటనకు టీమిండియా బయలుదేరే ముందు అగార్కర్ చెప్పాడు.
టీమ్మేట్స్ ఫీడ్‌బ్యాక్ తర్వాతే నిర్ణయం
ఇక సూర్యకు కెప్టెన్సీ అప్పగించే ముందు టీమ్మేట్స్ ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ను పరిగణనలోకి తీసుకున్నట్లు కూడా అగార్కర్ చెప్పాడు. "అత్యంత అర్హులైన ప్లేయర్స్ లో ఒకడు కాబట్టే సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ ను చేశాం. డ్రెస్సింగ్ రూమ్ నుంచి కూడా ఫీడ్ బ్యాక్స్ అందుకున్నాం. అతనికి మంచి క్రికెట్ బ్రెయిన్ ఉంది. వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్. అన్ని గేమ్స్ ఆడతాడు. ఓ కెప్టెన్ గా విజయవంతమయ్యేందుకు ఉండాల్సిన లక్షణాలన్నీ సూర్యలో ఉన్నాయి" అని అగార్కర్ తెలిపాడు.
హార్దిక్ పాండ్యా కొన్నాళ్లుగా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. గతేడాది వరల్డ్ కప్ సందర్భంగా మడమ గాయానికి గురవడంతో ఆ టోర్నీతోపాటు ఈ ఏడాది చాలా వరకు సిరీస్ లకు దూరమయ్యాడు. 2022 మొదటి నుంచి ఇండియా 79 టీ20లు ఆడగా.. అందులో హార్దిక్ కేవలం 46 మ్యాచ్ లకే అందుబాటులో ఉన్నాడు. మరోవైపు టీ20ల్లో సూర్య మాత్రం రెగ్యులర్ గా జట్టుతో ఉంటున్నాడు.
గతేడాది ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో సిరీస్ లో రోహిత్ లేకపోవడంతో సూర్య కెప్టెన్సీ చేపట్టాడు. ఆస్ట్రేలియాపై 4-1తో గెలవగా.. సౌతాఫ్రికాతో 1-1తో డ్రా చేసుకున్నాడు. ఇప్పుడు టీ20ల్లో పూర్తి స్థాయి కెప్టెన్ గా తొలిసారి శ్రీలంక సిరీస్ తో సూర్య సవాలు ఎదుర్కోబోతున్నాడు. జులై 27 నుంచి 30 వరకు మూడు టీ20ల సిరీస్ జరగనుంది.