Rohit Sharma Stand: వారెవా రోహిత్ శర్మ.. టీమిండియా కెప్టెన్‌కు అరుదైన గౌరవం.. వాంఖెడెలో స్టాండ్
Rohit Sharma Stand: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. అతని పేరిట వాంఖెడే స్టేడియంలో ఓ స్టాండ్ ఏర్పాటు చేయాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అతడు దిగ్గజాల సరసన నిలవనున్నాడు.
Rohit Sharma Stand: టీమిండియా టెస్ట్, వన్డే టీమ్స్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ పేరును ముంబైలోని వాంఖెడే స్టేడియంలోని ఓ స్టాండ్ కు పెట్టనున్నారు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ మంగళవారం (ఏప్రిల్ 15) కన్ఫమ్ చేసింది. వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆ అసోసియేషన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రోహిత్ తోపాటు దివంగత క్రికెటర్ అజిత్ వాడేకర్ పేరిట కూడా మరో స్టాండ్ ఏర్పాటు చేయనున్నారు.
రోహిత్ శర్మ స్టాండ్
ఇండియా 14 ఏళ్ల కిందట వన్డే వరల్డ్ కప్ గెలిచిన ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఓ స్టాండ్ కు రోహిత్ శర్మ పేరు పెట్టాలని నిర్ణయించడం నిజంగా ఓ అరుదైన గౌరవమే. ప్రస్తుతం టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే. అతని కెప్టెన్సీలో ఇండియన్ టీమ్ టీ20 వరల్డ్ కప్ తోపాటు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచిన విషయం తెలిసిందే. ఇండియన్ టీమ్ కు ధోనీ తర్వాత ఒకటి కంటే ఎక్కువ ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మే.
అంతేకాదు అతని కెప్టెన్సీలో 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కూడా చేరింది. దీంతో తమ క్రికెటర్ ను ముంబై క్రికెట్ అసోసియేషన్ ఇలా గౌరవించుకుంది. అతనితోపాటు అజిత్ వాడేకర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ ల పేరిట కూడా స్టాండ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక స్టేడియంలోని లాంజ్‌కు ఎంసీఏ మాజీ అధ్యక్షుడు అమోల్ కాలే పేరు పెట్టనున్నారు.
దిగ్గజాల సరసన రోహిత్ శర్మ
ఈ అరుదైన ఘనతతో రోహిత్ శర్మ దిగ్గజ క్రికెటర్ల సరసన నిలిచాడు. ఇప్పటికే ఈ ప్రతిష్టాత్మక స్టేడియంలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, విజయ్ మర్చంట్ పేర్లతో స్టాండ్స్ ఉన్నాయి. ఇక సచిన్ టెండూల్కర్ కు చెందిన ఓ విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు రోహిత్ శర్మ పేరిట స్టాండ్ ఏర్పాటు చేయబోతున్నారు.
రోహిత్ తన కెరీర్ మొదటి నుంచీ ముంబై డొమెస్టిక్ టీమ్ కు ఆడుతున్నాడు. ఈ ఏడాది మొదట్లో రంజీ ట్రోఫీలో భాగంగా జమ్ముకశ్మీర్ తో మ్యాచ్ లోనూ అతడు ముంబై తరఫున బరిలోకి దిగాడు. రోహిత్ శర్మ పేరిట స్టేడియంలో ఏదో ఒక స్టాండ్ కు పేరు పెట్టనున్నారు. ప్రస్తుతం గ్రాండ్ స్టాండ్ కు ఎవరి పేరు లేదు. మరి రోహిత్ కు ఏ స్టాండ్ కేటాయిస్తారో చూడాలి.
సంబంధిత కథనం