ICC Rankings: అన్ని ఫార్మాట్‍లలో ప్రపంచ నంబర్ వన్ జట్టుగా టీమిండియా.. పాక్‍ను కిందికి నెట్టి..
Team India: మూడు ఫార్మాట్‍లలో ప్రపంచ నంబర్ వన్ జట్టుగా టీమిండియా అవతరించింది. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో విజయంతో వన్డేల్లోనూ టాప్ ప్లేస్‍కు చేరింది.
Team India: భారత క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. టెస్టు, వన్డే, టీ20.. ఇలా అన్ని ఫార్మాట్‍లలోనూ ఐసీసీ ప్రపంచ నంబర్ వన్ జట్టుగా టీమిండియా అవతరించింది. చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో నేడు జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ఈ గెలుపుతో వన్డేల్లోనూ ఐసీసీ ర్యాంకింగ్‍ల్లో టాప్ ప్లేస్‍కు చేరింది భారత్. పాకిస్థాన్‍ను రెండో ప్లేస్‍కు నెట్టి వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేరింది టీమిండియా. అన్ని ఫార్మాట్లలో ఏకకాలంలో నంబర్ స్థానాన్ని దక్కించుకున్న రెండో జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. 2012లో దక్షిణాఫ్రికా ఆ ఫీట్‍ను సాధించింది. ఇప్పుడు టీమిండియా ఈ అరుదైన ఘనత దక్కించుకుంది. వివరాలివే..
ట్రెండింగ్ వార్తలు
ఆసీస్‍తో గెలుపు తర్వాత 116 రేటింగ్ పాయింట్లతో భారత్ తాజా ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్‍ల్లో అగ్రస్థానానికి చేరింది. పాకిస్థాన్ (115) రెండో ప్లేస్‍కు పడిపోయింది. ఆస్ట్రేలియా (111) మూడో స్థానంలో కొనసాగింది. ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా (106), ఇంగ్లండ్ (105), న్యూజిలాండ్ (100) ఉన్నాయి.
ఇటీవలే ఆసియాకప్ టోర్నీ టైటిల్ గెలిచి సత్తాచాటింది భారత్. అక్టోబర్ 5వ తేదీ నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుండగా.. అంత కంటే ముందే టీమిండియా వన్డే ర్యాంకింగ్‍ల్లో టాప్ ర్యాంకుకు వచ్చింది. ఆల్‍రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటుతోంది. ఇది వరకే టెస్టులు, టీ20ల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది.
ప్రస్తుతం టెస్టుల్లో టీమిండియా 118 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ టెస్టు ర్యాకింగ్‍ల్లో నంబర్ వన్‍గా ఉంది. ఆస్ట్రేలియా (118) రెండో ర్యాంకులో ఉంది. ఇంగ్లండ్ (115), దక్షిణాఫ్రికా (104) ఆ తర్వాత ఉన్నాయి.
టీ20 ఫార్మాట్ ఐసీసీ ర్యాంకింగ్‍ల్లో భారత్ 264 పాయింట్లతో అగ్ర ర్యాంకులో కొనసాగుతోంది. ఇంగ్లండ్ (261) రెండో ర్యాంకులో, పాకిస్థాన్ (254) మూడో స్థానంలో ఉన్నాయి. న్యూజిలాండ్ (254), దక్షిణాఫ్రికా (251) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇలా.. మూడు ఫార్మాట్‍లలో ప్రస్తుతం టీమిండియా ప్రపంచ నంబర్ వన్ జట్టుగా అవతరించింది. ఈ ఘనత సాధించించిన టీమిండియాను అభినందించారు బీసీసీఐ కార్యదర్శి జై షా. ఈ మేరకు ట్వీట్ చేశారు. వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు ఇది అద్భుతమని భారత జట్టును ప్రశంసించారు.
టాపిక్