Bumrah injury: బుమ్రా స్కానింగ్ రిపోర్టుల కోసం వెయిటింగ్.. ఛాంపియన్స్ ట్రోఫీకి అనుమానమే.. అందుకే హర్షిత్ రాణా అరంగేట్రం
Bumrah: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత స్టార్ పేసర్ బుమ్రా ఆడటంపై సందిగ్ధత కొనసాగుతోంది. అతని వెన్నెముక గాయం స్కానింగ్ రిపోర్ట్ ల కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంగ్లండ్ తో తొలి వన్డేలో హర్షిత్ రాణా అరంగేట్రంతో బుమ్రా రాక ఆలస్యమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సన్నద్ధమవుతున్న భారత జట్టుకు షాక్ తప్పేలా లేదు. ఈ మెగా టోర్నీ ఆరంభమయ్యే (ఫిబ్రవరి 19) లోపు వెన్నెముక గాయం నుంచి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కోలుకోవడం సందేహంగా మారింది. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన టీమ్ఇండియాలో బుమ్రాకు కూడా చోటునిచ్చారు. కానీ ఇంగ్లండ్ తో వన్డేలో హర్షిత్ రాణా అరంగేట్రంతో బుమ్రా పునరాగమనం ఆలస్యమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.
అందుకే రాణా అరంగేట్రం
ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కు బుమ్రాను ఎంపిక చేసిన సెలక్టర్లు అతను తొలి రెండు మ్యాచ్ ల్లో ఆడడని, చివరి మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడని చెప్పారు. బుమ్రాకు ప్రత్యామ్నాయంగా యువ పేసర్ హర్షిత్ రాణాను ఎంపిక చేశారు. తొలి వన్డేతో అరంగేట్రం చేసిన అతను 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడేందుకు అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయనేది రాణా అరంగేట్రంతో స్పష్టమైందని మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
స్కానింగ్ లు కంప్లీట్
మరోవైపు జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్న బుమ్రాకు స్కానింగ్ లు నిర్వహించారు. వీటి రిపోర్టులు 24 గంటల తర్వాత వస్తాయి. అప్పుడే బుమ్రా గాయంపై ఓ అంచనాకు వచ్చే అవకాశముందని టైమ్స్ ఆఫ్ ఇండియా తన రిపోర్ట్ లో వెల్లడించింది. ఈ స్కానింగ్ రిపోర్టుల కోసం కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్ వెయిట్ చేస్తున్నారని తెలిపింది. ఆ రిపోర్ట్ లను 2023లో బుమ్రాకు వెన్నుముక చికిత్స చేసిన న్యూజిలాండ్ డాక్టర్ రోవన్ కు పంపిస్తారని తెలిసింది.
బుమ్రా లేకుంటే కష్టమే
టీమ్ఇండియాకు ఎంతో కీలకమైన బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడకపోతే జట్టుకు సమస్యలు తప్పవు. ఏ వేదికలో ఆడినా తన అద్భుత బౌలింగ్ తో బుమ్రా సత్తాచాటుతున్నాడు. గతేడాది జట్టు టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్ లోనూ అదరగొట్టాడు. పేస్ బౌలింగ్ తో బ్యాటర్లను గడగడలాడించే బుమ్రా లేకపోతే భారత బౌలింగ్ వీక్ అయ్యే ప్రమాదముంది.