యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ సెంచరీలు సాధించినా ఇంగ్లాండ్ తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో భారత్ స్కోరు 500 దాటలేకపోయింది. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ ఫెయిల్యూర్ తో టీమిండియా ఢమాల్ అంది. చివరి ఏడు వికెట్లను భారత్ కేవలం 41 పరుగుల తేడాతోనే కోల్పోయింది. ఓ దశలో 430/3తో నిలిచిన టీమిండియా, ఆ తర్వాత విఫలమై 471 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో కెప్టెన్ స్టోక్స్, జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లతో భారత్ ను దెబ్బకొట్టాడు.
అయితే ఇండియా ఇన్నింగ్స్ ముగిశాక మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఇంకా స్టార్ట్ కాలేదు.
359/3 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం (జూన్ 21) తొలి ఇన్నింగ్స్ కొనసాగించింది భారత్. శుభ్‌మన్ గిల్ (ఓవర్ నైట్ స్కోరు 127), పంత్ (ఓవర్ నైట్ స్కోరు 65) రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించారు. లీడ్స్ లో ఇంగ్లిష్ బౌలర్లను ఈ జోడీ సమర్థంగా అడ్డుకుంది. పంత్ సెంచరీ అందుకున్నాడు. గిల్ కూడా జోరుమీద కనిపించాడు. భారత్ 430/3తో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ అంతలోనే కథ అడ్డం తిరిగింది.
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ను ఔట్ చేసి పార్ట్ నర్ షిప్ బ్రేక్ చేశాడు స్పిన్నర్ షోయబ్ బషీర్. భారత కెప్టెన్ గా తన ఫస్ట్ టెస్టులో గిల్ 227 బంతుల్లో 147 పరుగులు చేశాడు. 19 ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టాడు. అక్కడి నుంచి టపటపా వికెట్లు పడ్డాయి. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి టెస్టు ఆడుతున్న కరుణ్ నాయర్ (0) డకౌటయ్యాడు.
రిషబ్ పంత్ ను టంగ్ ఔట్ చేయడంతో భారత్ కు భారీ షాక్ తగిలింది. పంత్ 178 బంతుల్లో 134 పరుగులు సాధించాడు. 12 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. పంత్ వికెట్ తర్వాత బ్యాటర్లందరూ వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. శార్దూల్ ఠాకూర్ (1)ను ఔట్ తో ఫస్ట్ సెషన్ ముగిసింది. లంచ్ తర్వాత బుమ్రా (0), జడేజా (11), ప్రసిద్ధ్ (1) ఔటవడంతో ఇండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా ఇన్నింగ్స్ లో లాస్ట్ 6 బ్యాటర్లలో ఒక్కరి స్కోరు కూడా కనీసం 12 దాటకపోవడం గమనార్హం.
ఇంగ్లాండ్ తో ఇండియా ఫస్ట్ టెస్టు తొలి రోజు (జూన్ 20) ఆటలో యశస్వి జైస్వాల్ కూడా సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ యంగ్ ఓపెనర్ 159 బంతుల్లో 101 పరుగులు చేశాడు. 16 ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు. కేఎల్ రాహుల్ 42 పరుగులతో రాణించాడు.
సంబంధిత కథనం