T20I Records: ఒక ఓవర్లో 52 రన్స్.. 20 ఓవర్లలో 427 రన్స్.. రికార్డుల ఊచకోత
T20I Records: ఒక ఓవర్లో 52 రన్స్.. 20 ఓవర్లలో 427 రన్స్.. ఇంతకుముందు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ స్కోర్లు వినడం కానీ, చూడటం కానీ చేశారా? అది కూడా ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో అంటే నమ్మగలరా?
T20I Records: రికార్డుల ఊచకోత ఎలా ఉంటుందో ఈ మ్యాచ్ చూస్తే తెలుస్తుంది. ఒకే ఓవర్లో 52 పరుగులు.. మొత్తంగా 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 427 పరుగులు. అది కూడా ఏ గల్లీ క్రికెట్ లోనో కాదు.. ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో కావడం విశేషం. అర్జెంటీనా వుమెన్, చిలీ వుమెన్ టీమ్స్ మధ్య శుక్రవారం (అక్టోబర్ 13) జరిగిన మ్యాచ్ లో ఎన్నో అంతర్జాతీయ టీ20 రికార్డులు బ్రేకయ్యాయి.
అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లో ఈ మ్యాచ్ జరిగింది. టీ20 క్రికెట్ పురుషుల, మహిళల క్రికెట్ లో ఇప్పటి వరకూ నమోదు కానీ స్కోరు ఈ మ్యాచ్ లో నమోదైంది. అర్జెంటీనా వుమెన్స్ టీమ్ ఏకంగా 20 ఓవర్లలోనే 427 రన్స్ బాదింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన అర్జెంటీనా రికార్డుల ఊచకోత చేసింది. ఆ టీమ్ ఓపెనర్లు లూసియా టేలర్, ఆల్బెర్టినా గలాన్ కేవలం 16.5 ఓవర్లలోనే తొలి వికెట్ కు ఏకంగా 350 రన్స్ జోడించారు.
టీ20 క్రికెట్ లో ఏ వికెట్ కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. లూసియా 84 బంతుల్లో 27 ఫోర్లతో 169 రన్స్ చేసి ఔటైంది. మరో ఓపెనర్ ఆల్బెర్టినా కూడా 84 బంతుల్లోనే 23 ఫోర్లతో 145 రన్స్ చేసి అజేయంగా నిలిచింది. మూడోస్థానంలో వచ్చిన మారియా 16 బంతుల్లో 40 రన్స్ చేసింది. రికార్డుల పరంపర ఇక్కడితో ఆగలేదు. చిలీ టీమ్ ఏకంగా 73 ఎక్స్‌ట్రాలు వేసింది.
అందులో 64 నోబాల్స్ కావడం విశేషం. అంటే నోబాల్స్ రూపంలోనే చిలీ టీమ్ 10.4 ఓవర్లు ఎక్కువ వేసేసింది. ఇక మిగిలిన వాటిలో ఒక బై, 8 వైడ్లు ఉన్నాయి. చిలీకి చెందిన ఫ్లోరెన్సియా మార్టినెజ్ ఒకే ఓవర్లో ఏకంగా 52 రన్స్ ఇచ్చింది. మరో బౌలర్ కాన్‌స్టాంజా తన 4 ఓవర్లలో 92 పరుగులు సమర్పించుకుంది. ఇక ఎమిలియా టోరో అనే మరో బౌలర్ కేవలం 3 ఓవర్లలో 83 రన్స్ ఇచ్చింది.
అర్జెంటీనా ఇంత భారీ స్కోరు చేసినా.. అందులో ఒక్క సిక్స్ కూడా లేకపోవడం ఈ మ్యాచ్ లో మరో విశేషం. తర్వాత చేజింగ్ లో చిలీ టీమ్ 15వ ఓవర్లోనే కేవలం 63 పరుగులకే కుప్పకూలింది. అర్జెంటీనా టీమ్ ఏకంగా 364 పరుగుల తేడాతో గెలిచింది. ఓ అంతర్జాతీయ మ్యాచ్ ఇంత ఏకపక్షంగా, ఇన్ని రికార్డుల మధ్య జరగడం అత్యంత అరుదుగా జరిగేదే.