T20 World Record: టీ20ల్లో మరో వరల్డ్ రికార్డు.. 349 రన్స్.. 37 సిక్స్‌లు.. బౌలర్ల ఊచకోత.. హార్దిక్ పాండ్యా లేకపోయినా..
T20 World Record: టీ20 క్రికెట్ లో మరో వరల్డ్ రికార్డు నమోదైంది. ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు, అత్యధిక సిక్స్ ల రికార్డు నమోదైన రెండు నెలల్లోనే బ్రేకవడం విశేషం. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా హార్దిక్ పాండ్యా లేకపోయినా బరోడా టీమ్ ఈ రికార్డు క్రియేట్ చేసింది.
T20 World Record: టీ20 క్రికెట్లో బరోడా టీమ్ సంచలనం సృష్టించింది. 20 ఓవర్లలో ఏకంగా 349 రన్స్ బాది వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. అత్యధిక పరుగులే కాదు.. ఒక ఇన్నింగ్స్ లో 37 సిక్స్ లతో అత్యధిక సిక్స్‌ల వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. రెండు నెలల కిందట జింబాబ్వే టీమ్ క్రియేట్ చేసిన రికార్డులను ఇప్పుడు బరోడా తిరగరాసింది.
బరోడా టీ20 వరల్డ్ రికార్డు
ప్రస్తుతం దేశంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరుగుతున్న విషయం తెలుసు కదా. ఇందులో భాగంగా బరోడా, సిక్కిం మధ్య జరిగిన మ్యాచ్ లో వరల్డ్ రికార్డు నమోదైంది. టీ20 చరిత్రలో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు, అత్యధిక సిక్స్ ల రికార్డులు నమోదు కావడం విశేషం. సిక్కింపై 20 ఓవర్లలోనే బరోడా 5 వికెట్లకు 349 రన్స్ చేసింది. ఇంతకుముందు గాంబియాపై జింబాబ్వే టీమ్ 20 ఓవర్లలో 344 రన్స్ చేయగా.. ఆ రికార్డు ఇప్పుడు కనుమరుగైంది.
అంతేకాదు ఆ మ్యాచ్ లో జింబాబ్వే 27 సిక్స్ లు బాదగా.. బరోడా ఇప్పుడు 37 సిక్స్ లతో దానిని తిరగరాసింది. ఇండోర్ లోని ఎమరాల్డ్ హై స్కూల్ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్ లో బరోడా బ్యాటర్ల ధాటికి సిక్కిం బౌలర్ల దగ్గర అసలు సమాధానమే లేకుండా పోయింది. పవర్ ప్లేలోనే 100, 11వ ఓవర్లో 200, 18వ ఓవర్లోనే 300 పరుగులు మైలురాయి చేరుకుంది. తొలి ఓవర్ నుంచి చివరి వరకు 17 రన్ రేట్ కు తక్కువ కాకుండా రన్స్ చేయడం విశేషం.
పాండ్యా లేకపోయినా..
బరోడా టీమ్ తరఫున స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో బరిలోకి దిగలేదు. అయినా ఆ టీమ్ తరఫున భాను పనియా సెంచరీ, మరో ముగ్గురు హాఫ్ సెంచరీలు చేశారు. ముఖ్యంగా భాను పనియా అయితే కేవలం 51 బంతుల్లోనే 134 రన్స్ చేశాడు. అందులో 15 సిక్స్ లు ఉన్నాయి. ఇక అభిమన్యు రాజ్‌పుత్, శివాలిక్ శర్మ, విష్ణు సోలంకి కూడా హాఫ్ సెంచరీలు చేశారు.
ఈ క్రమంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గతంలో పంజాబ్ పేరిట ఉన్న 275 రన్స్ రికార్డును కూడా బరోడా తిరగరాసింది. పురుషుల టీ20 క్రికెట్ ఒక ఇన్నింగ్స్ లో 300కుపైగా పరుగులు చేసిన మూడో టీమ్ బరోడా. గతంలో నేపాల్, జింబాబ్వే టీమ్స్ ఈ రికార్డును అందుకున్నాయి. భారత గడ్డపైనా టీ20ల్లో ఇదే అత్యధిక స్కోరు. ఈ మధ్యే బంగ్లాదేశ్ పై ఇండియన్ టీమ్ హైదరాబాద్ లో 297 రన్స్ చేయగా.. ఇప్పుడా రికార్డు మరుగున పడింది.