Siraj in Hyderabad: హైదరాబాద్ తిరిగి వచ్చిన వరల్డ్ కప్ హీరో.. సిరాజ్‌కు అభిమానుల గ్రాండ్ వెల్కమ్
Siraj in Hyderabad: టీ20 వరల్డ్ కప్ హీరో మహ్మద్ సిరాజ్ కు హైదరాబాద్ లో గ్రాండ్ వెల్కమ్ లభించింది. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత తొలిసారి శుక్రవారం (జులై 5) సాయంత్రం అతడు భాగ్యనగరంలో అడుగుపెట్టాడు.
Siraj in Hyderabad: టీమిండియా పేస్ బౌలర్, టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు అయిన మహ్మద్ సిరాజ్ సొంతూరికి తిరిగొచ్చాడు. గురువారం (జులై 4) ఉదయం ఢిల్లీలో ల్యాండై, పీఎం మోదీని కలిసి, ముంబైలో విక్టరీ పరేడ్ లో పాల్గొన్న అతడు.. మొత్తానికి శుక్రవారం (జులై 5) సాయంత్రం ఇంటికి చేరాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే అతనికి ఘన స్వాగతం లభించగా.. మెహదీపట్నం నుంచి రోడ్ షో కూడా నిర్వహించారు. ఓపెన్ టాప్ జీపులో అతడు అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లాడు.
సిరాజ్‌కు గ్రాండ్ వెల్కమ్
మహ్మద్ సిరాజ్ కు హైదరాబాద్ క్రికెట్ అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. తన రోడ్ షో విషయం సిరాజ్ ముందుగానే సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేయడంతో వేల మంది అభిమానులు అతనికి స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టులోనే అతడు బయటకు రాగానే అక్కడ వేచి చూస్తున్న ఫ్యాన్స్ గట్టిగా అరిచారు. అతన్ని తమ కెమెరాల్లో బంధించడానికి ఎగబడ్డారు.
ఆ తర్వాత మెహదీపట్నంలోని సరోజిని దేవి హాస్పిటల్ నుంచి ఈద్గా గ్రౌండ్ వరకు రోడ్ షో కూడా నిర్వహించారు. ఇందులో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఓపెన్ టాప్ జీపులో మెడలో తాను గెలిచిన టీ20 వరల్డ్ కప్ మెడల్ వేసుకొని సిరాజ్ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగాడు. కొన్నాళ్లుగా టీమిండియాలో కీలక బౌలర్ గా ఎదిగిన సిరాజ్.. ఇప్పుడీ వరల్డ్ కప్ గెలిచిన జట్టులోనూ ఉన్నాడు.
టీ20 వరల్డ్ కప్‌లో సిరాజ్
టీ20 వరల్డ్ కప్ లో మహ్మద్ సిరాజ్ లీగ్ స్టేజ్ లో మూడు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. అందులో ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ పై 3 ఓవర్లు వేసి 13 పరుగులు ఇచ్చి వికెట్ తీశాడు. తర్వాత పాకిస్థాన్ తో మ్యాచ్ లో 4 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చినా వికెట్ తీయలేదు. ఇక యూఎస్ఏతో మ్యాచ్ లో 4 ఓవర్లలో 25 రన్స్ ఇచ్చాడు. వికెట్ పడలేదు.
దీంతో సూపర్ 8 స్టేజ్ నుంచి అతన్ని పక్కన పెట్టి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు జట్టులో చోటు కల్పించారు. ఈ కాంబినేషన్ సక్సెస్ కావడంతో ఫైనల్ వరకూ అదే కొనసాగించారు. దీంతో సిరాజ్ కు మరో మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. బుమ్రా, అర్ష్‌దీప్, హార్దిక పాండ్యాల పేస్ బౌలింగ్ తోనే జట్టును కొనసాగించారు.
అయితే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బార్బడోస్ నుంచి ఢిల్లీ వచ్చే సమయంలో ఫ్టైట్ లోనే అతడు వరల్డ్ కప్ ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చాడు. ఢిల్లీలో దిగిన తర్వాత ప్రధాని మోదీని కూడా టీమ్ సభ్యులు కలిశారు. అప్పుడు మోదీతో ప్రత్యేకంగా ఫొటో దిగిన సిరాజ్.. ప్రధానిని కలవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఎక్స్ అకౌంట్లో ఫొటోలో పోస్ట్ చేశాడు.