T20 World Cup 2024 Umpires: టీ20 వరల్డ్ కప్ అంపైర్లు, రిఫరీలు వీళ్లే.. ముగ్గురు ఇండియన్స్
T20 World Cup 2024 Umpires: వచ్చే నెలలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం మ్యాచ్ అధికారులను ఐసీసీ అనౌన్స్ చేసింది. వీళ్లలో ముగ్గురు ఇండియన్ అంపైర్లు, రిఫరీలకు చోటు దక్కింది.
T20 World Cup 2024 Umpires: టీ20 వరల్డ్ కప్ 2024 కోసం ఐసీసీ శుక్రవారం (మే 3) 26 మంది మ్యాచ్ అధికారులను అనౌన్స్ చేసింది. జూన్ 2 నుంచి 29 వరకు వెస్టిండీస్, అమెరికాల్లో జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం 20 మంది అంపైర్లు, ఆరుగురు రిఫరీలను ఐసీసీ నియమించింది. వీళ్లలో ముగ్గురు భారత అధికారులకు చోటు దక్కింది.
టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ అధికారులు వీళ్లే
టీ20 వరల్డ్ కప్ 9వ ఎడిషన్ వచ్చే నెల జరగనుంది. దీనికోసం ఇప్పటికే అన్ని టీమ్స్ తమ జట్లను అనౌన్స్ చేస్తున్నాయి. అటు ఐసీసీ కూడా మ్యాచ్ అధికారుల జాబితాను ప్రకటించింది. మొత్తంగా 28 రోజుల పాటు 20 జట్లు 55 మ్యాచ్ లు ఆడే ఈ టోర్నీ కోసం 26 మంది అధికారులు నియమితులయ్యారు. వాళ్లలో 20 మంది అంపైర్లు కాగా.. మరో ఆరుగురు రిఫరీలు.
వీళ్లలో ఇండియా నుంచి ముగ్గురు ఉన్నారు. నితిన్ మేనన్, జయరామన్ మదనగోపాల్ అంపైర్లుగా ఎంపికవగా.. జవగళ్ శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీగా వరల్డ్ కప్ కు వెళ్లనున్నారు. ఈ మెగా టోర్నీ కోసం ఎందరో అనుభవజ్ఞులైన అంపైర్లను ఎంపిక చేశారు. వీళ్లలో గతేడాది అంపైర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికైన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, కుమార ధర్మసేన, క్రిస్ గఫనీ, పాల్ రైఫిల్ కూడా ఉన్నారు.
ఇండియా నుంచి వెళ్తున్న జయరామన్ మదనగోపాల్ ఈ వరల్డ్ కప్ ద్వారానే సీనియర్ మెన్స్ క్రికెట్ మ్యాచ్ లకు తొలిసారి అంపైరింగ్ చేయనున్నాడు. ఇక మ్యాచ్ రిఫరీల విషయానికి వస్తే శ్రీనాథ్ తోపాటు సీనియర్ రిఫరీలు రంజన్ మదుగలె, జెఫ్ క్రో, ఆండ్రూ పైక్రాఫ్ట్ ఉన్నారు.
అంపైర్లు వీళ్లే
క్రిస్ బ్రౌన్, ధర్మసేన, క్రిస్ గఫనీ, మైఖేల్ గాఫ్, హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అల్లాహుద్దీన్ పాలేకర్, రిచర్డ్ కెటిల్‌బరో, జయరామన్ మదనగోపాల్, నితిన్ మేనన్, సామ్ నోగాస్కి, ఎహసాన్ రజా, రషీద్ రియాజ్, పాల్ రైఫిల్, లాంగ్టన్ రుసెరె, షాహిత్ సైకాత్, రాడ్నీ టక్కర్, అలెక్స్ వార్ఫ్, జోయెల్ విల్సన్, ఆసిఫ్ యాకూబ్.
మ్యాచ్ రిఫరీలు
డేవిడ్ బూన్, జెఫ్ క్రో, రంజన్ మదుగలె, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్‌సన్, జవగళ్ శ్రీనాథ్
ఈసారి ఎన్నడూ లేని విధంగా టీ20 వరల్డ్ కప్ లో మొత్తం 20 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఇండియా గ్రూప్ ఎలో ఉంది. ఈ గ్రూపులో పాకిస్థాన్, ఐర్లాండ్, యూఎస్ఏ, కెనడా ఉన్నాయి.