Pakistan Cricket: ఇది వెనకడుగు వేయడమే: పీసీబీపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఫైర్
Pakistan Cricket - Ramiz Raja: ప్రపంచకప్‍లో తొలి రెండు మ్యాచ్‍లు ఓడిన పాకిస్థాన్ జట్టుపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. పీసీబీ మాజీ చైర్మన్, మాజీ కెప్టెన్ రమీజ్ రాజా ఈ విషయంలో పీసీబీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pakistan Cricket: టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో తొలి రెండు మ్యాచ్‍లు ఓడిన పాకిస్థాన్ జట్టుపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కొందరు పాక్ మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మెగాటోర్నీలో తన తొలి మ్యాచ్‍లో అమెరికాపై పాకిస్థాన్ చిత్తుగా ఓడింది. సూపర్ ఓవర్ వరకు వెళ్లి పరాజయం పాలైంది. భారత్‍తో తదుపరి జరిగిన మ్యాచ్‍లోనూ పాక్ ఓడిపోయింది. గత ఎడిషన్‍లో ఫైనల్ వరకు వెళ్లిన పాకిస్థాన్.. ప్రస్తుత ప్రపంచకప్‍లో ఒత్తిడిలో పడిపోయింది.
పాకిస్థాన్ పేలవ ప్రదర్శనపై చాలా మంది మాజీలు కొన్ని కారణాలను చూపిస్తూ విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన మహమ్మద్ ఆమిర్, ఇమాద్ వసీంను మళ్లీ తీసుకొచ్చి ప్రపంచకప్ ఆడిస్తుండటంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. వారిద్దరూ గతంలోనే రిటైర్మెంట్ ప్రకటించగా.. ఈ ఏడాది ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే, వారిని టీ20 ప్రపంచకప్‍కు పాకిస్థాన్ బోర్డు ఎంపిక చేసింది. ఈ విషయంపై పీసీబీ మాజీ చైర్మన్, మాజీ కెప్టెన్ రమీజ్ రాజా కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అలాంటి వాళ్లను తీసుకోవాలి
యువ ఆటగాళ్లను తీసుకోకుండా.. రిటైర్మెంట్ నుంచి వచ్చిన వారిని ప్రపంచకప్‍కు సెలెక్టర్లు ఎంపిక చేయడంపై రమీజ్ రాజా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలా చేయడంతో వెనకడుగు వేసినట్టయిందని చెప్పాడు. ఒత్తిడిని తట్టుకునే ప్లేయర్లను సానపట్టాలని, పాకిస్థాన్ జట్టులో చాలా మార్పులు చేయాలని సూచించాడు. “ప్రపంచకప్ తర్వాత జట్టును మార్చడం ప్రారంభించాలి. ఒత్తిడిని ఎవరు తట్టుకోగలరో.. ఎవరికి స్పష్టత ఉందో అలాంటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలి. రిటైర్ అయిన ప్లేయర్లను వెనక్కి తీసుకురావాల్సిన అవసరం లేదు. రిటైర్ అయిన వారిని మళ్లీ తీసుకుంటే.. ఫస్ట్ క్లాస్, ఏజ్ గ్రూప్‍ల్లో రాణిస్తున్న వారికి నిరాశ కలిగించినట్టే. ఇలా చేయడం వల్ల కొత్త టాలెంట్ జట్టులోకి రాదనే సంకేతాలను ఇచ్చినట్టు అవుతుంది” అని రమీజ్ రాజా క్రిక్ బజ్‍తో చెప్పాడు.
జట్టుకు మేలు జరిగేందుకు ఆటగాళ్లను రిటైర్మెంట్ నుంచి బయటికి తీసుకొస్తున్నామని అనుకుంటున్నారని, కానీ అలా జరగడం లేదని రమీజ్ రాజా అన్నారు. ఇలా చేయడం వెనకడుగు వేయడం లాంటిదని చెప్పాడు.
రిటైర్మెంట్.. యూటర్న్
అంతర్జాతీయ క్రికెట్‍కు 2021లోనే మహమ్మద్ ఆమిర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇది అందరినీ షాక్‍కు గురి చేసింది. అయితే, అతడు మళ్లీ యూ-టర్న్ తీసుకొని ఈ ఏడాది రిటైర్మెంట్‍ను వెనక్కి తీసుకున్నాడు. ఇమాద్ వాసిం విషయంలోనూ ఇదే జరిగింది. గతేడాది రిటైర్మెంట్ ప్రకటించిన అతడు.. మళ్లీ ఈ ఏడాది దాన్ని ఉపసంహరించుకున్నాడు. పీసీబీ చీఫ్‍గా మొహిసిన్ నఖ్వి రావటంతోనే వీరిద్దరూ రిటైర్మెంట్ నుంచి బయటికి వచ్చారనే ప్రచారం జరిగింది. అలాగే, టీ20 ప్రపంచకప్‍లో ఈ ఇద్దరికీ చోటిచ్చింది పీసీబీ.
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో గ్రూప్-ఏలో తొలి రెండు మ్యాచ్‍లు ఓడింది పాకిస్థాన్. సూపర్-8కు చేరాలంటే ఇక గ్రూప్ దశలో మిగిలిన రెండు మ్యాచ్‍ల్లో కెనడా, ఐర్లాండ్‍పై బాబర్ ఆజమ్ సేన భారీగా గెలువాలి. అమెరికా మిగిలిన రెండు మ్యాచ్‍ల్లో ఓడాలి. అప్పుడు కూడా నెట్ రన్‍రేట్‍పై పాకిస్థాన్ ఆశలు ఆధారపడి ఉంటాయి.