T20 World Cup 2024: సూపర్-8కు పాకిస్థాన్ చేరగలదా? భారత్‍పైనే పాక్ ఆశలు!
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‍లో పాకిస్థాన్ వరుసగా రెండు మ్యాచ్‍ల్లో ఓడింది. దీంతో ఆ జట్టుకు సూపర్-8 అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. పాక్ ఎలా అయితే సూపర్-8కు చేరగలదో ఇక్కడ తెలుసుకోండి.
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీలో పాకిస్థాన్‍కు ఆరంభంలోనే రెండు పరాజయాలు ఎదురయ్యాయి. తన తొలి మ్యాచ్‍లో అమెరికా చేతిలో పాక్ అనూహ్యంగా ఓడింది బాబర్ ఆజమ్ సేన . ఆదివారం (జూన్ 9) న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్‍లో భారత్ చేతిలో పాక్ ఓడింది. దీంతో గ్రూప్-ఏలో రెండు వరుస ఓటములతో కష్టాల్లో పడింది. సూపర్-8కు అర్హతను సంక్లిష్టంగా మార్చుకుంది.
గ్రూప్-ఏ ప్రస్తుతం ఇలా..
టీ20 ప్రపంచకప్‍లో 20 జట్లు తలపడుతుండగా.. నాలుగు గ్రూప్‍ల్లో చెరో ఐదు జట్లు ఉన్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, అమెరికా, కెనడా, ఐర్లాండ్ ఉన్నాయి. గ్రూప్ దశలో ఒక్కో జట్టు నాలుగు మ్యాచ్‍లు ఆడుతుంది. ఇప్పటికే ఆడిన చెరో రెండు మ్యాచ్‍ల్లో భారత్, అమెరికా గెలిచాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో ఈ రెండు జట్లు గ్రూప్-ఏలో మొదటి, రెండో స్థానాల్లో ఉన్నాయి. రెండింట్లో ఓ మ్యాచ్ గెలిచిన కెనడా మూడో ప్లేస్‍లో ఉండగా.. రెండూ ఓడిన పాకిస్థాన్, ఐర్లాండ్ నాలుగు, ఐదు ప్లేస్‍ల్లో ఉన్నాయి. గ్రూప్ దశలో ముగిసే సరికి టాప్‍లో నిలిచే రెండు జట్లు సూపర్-8కు చేరతాయి.
పాక్ సూపర్-8 చేరాలంటే..
ప్రపంచకప్ గ్రూప్-ఏలో పాకిస్థాన్ ఇంకా రెండు మ్యాచ్‍లు ఆడాల్సి ఉంది. జూన్ 11న కెనడాతో (న్యూయార్క్‌లో), జూన్ 16న ఐర్లాండ్‍తో (ఫ్లోరిడాలో) పాక్ ఆడనుంది. సూపర్-8 చేరాలంటే పాకిస్థాన్ ఈ రెండు మ్యాచ్‍లను భారీగా గెలువాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాక్ నెట్‍రన్ రేట్ -0.15గా ఉంది. భారత్, అమెరికా ప్లస్ నెట్ రన్‍రేట్‍తో ఉన్నాయి. దీంతో మిగిలిన రెండు మ్యాచ్‍ల్లో పాక్ భారీతో విజయం సాధించాలి. అలాగే, అమెరికా కూడా తన రెండు మ్యాచ్‍ల్లో ఓడాలి. ఐర్లాండ్, కెనడా కూడా ఇంకా కనీసం ఒక్క మ్యాచ్ అయినా పరాజయం చెందాలని కోరుకోవాలి.
భారత్‍పై ఆశలు ఇలా..
పాకిస్థాన్ రెండు మ్యాచ్‍లు గెలిచినా.. అమెరికాపై భారత్ భారీగా గెలిస్తే సూపర్-8 అవకాశాలు మెరుగవుతాయి. టీమిండియా భారీ తేడాతో గెలిస్తే అమెరికా నెట్ రన్‍రేట్ తగ్గుతుంది. అందుకే భారత్‍పైనే పాకిస్థాన్ ఆశలు పెట్టుకుంది. అమెరికాపై టీమిండియా సూపర్ విక్టరీ సాధించాలని కోరుకుంటోంది. అలాగే, కెనడాపై కూడా భారత్ గెలిస్తే పాక్‍కు ప్లస్ అవుతుంది.
జూన్ 12న అమెరికాతో న్యూయార్క్‌లో, జూన్ 15న కెనడాతో ఫ్లోరిడాలో భారత్ తలపడనుంది. ఒక్క మ్యాచ్ గెలిచినా సూపర్-8లో ప్లేస్‍ను పక్కా చేసుకుంటుంది టీమిండియా.
భారత్ చేతిలో పాక్ చిత్తు
న్యూయార్క్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‍లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. రిషబ్ పంత్ (42) మినహా మిగిలిన టీమిండియా బ్యాటర్లు రాణించలేకపోయారు. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా, హరిస్ రవూఫ్ చెరో మూడు వికెట్లు తీశారు. అయితే, భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పాకిస్థాన్‍ను కట్టడి చేశారు. దీంతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులకే పరిమితమై పాక్ ఓడిపోయింది. ఆరు పరుగుల తేడాతో భారత్ గెలిచింది. జస్‍ప్రీత్ బుమ్రా మూడు వికెట్లతో సత్తాచాటాడు.