T20 World Cup 2024 Live Streaming: టీ20 ప్రపంచకప్ కప్ మ్యాచ్‍ల లైవ్ స్ట్రీమింగ్ ఉచితంగా చూడొచ్చు: వివరాలివే
T20 World Cup 2024 Live Streaming: ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ టోర్నీ మ్యాచ్‍ల లైవ్‍ను ప్రేక్షకులు ఉచితంగా చూడొచ్చు. ఓటీటీలో సబ్‍స్క్రిప్షన్ లేకుండానే లైవ్ స్ట్రీమింగ్ వీక్షించవచ్చు. ఆ వివరాలివే..
T20 World Cup 2024 Live Details: టీ20 ప్రపంచకప్ 2024 మెగా క్రికెట్ టోర్నీ ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు జరగనుంది. ఈసారి ఈ పొట్టి ప్రపంచకప్‍లో ఏకంగా 20 జట్లు తలపడనున్నాయి. వెస్టిండీస్, అమెరికా వేదికలు ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఇప్పటికే ఈ టోర్నీ షెడ్యూల్‍ను ఐసీసీ వెల్లడించింది. జూన్ 5న ఈ టోర్నీలో తన తొలి మ్యాచ్ ఆడనుంది భారత్. కాగా, టీ20 ప్రపంచకప్ 2024 విషయంలో డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ప్రేక్షకులకు గుడ్‍న్యూస్ చెప్పింది.
ఫ్రీ స్ట్రీమింగ్
టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్‍లను ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్టు డిస్నీ+ హాట్‍స్టార్ ప్రకటించింది. ప్రపంచకప్ కోసం తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఈ విషయాన్ని వెల్లడించింది. డిస్నీ హాట్‍స్టార్ మొబైల్ యాప్‍లో ప్రపంచకప్ అన్ని మ్యాచ్‍ల లైవ్ స్ట్రీమింగ్‍ను ఫ్రీగా చూడొచ్చని పేర్కొంది. అంటే సబ్‍స్క్రిప్షన్ లేకపోయినా ఈ మ్యాచ్‍ల లైవ్‍ను హాట్‍స్టార్‌లో యూజర్లు వీక్షించవచ్చు.
గతేడాది ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ టోర్నీల మ్యాచ్‍లను కూడా తన మొబైల్ యాప్‍లో ఉచితంగా స్ట్రీమింగ్ చేసింది డిస్నీ+ హాట్‍స్టార్. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‍ను కూడా మొబైల్ యూజర్లకు ఉచితంగా స్ట్రీమింగ్ ఇవ్వనుంది. అయితే, మొబైల్ యాప్‍లో కాకుండా వెబ్ వెర్షన్‍లో లైవ్ చూడాలంటే ఏదో ఒక ప్లాన్‍ను సబ్‍స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మొబైల్ యాప్‍లో అయితే ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.
టీ20 ప్రపంచకప్ 2024 వివరాలు
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. మొత్తంగా 55 మ్యాచ్‍లు జరుగుతాయి. 20 జట్లు ఐదు గ్రూప్‍లుగా విడిపోయి.. గ్రూప్ మ్యాచ్‍లు ఆడనున్నాయి.
భారత్, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లతో పాటు టెస్టు హోదా లేని అమెరికా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్, ఉగాండ, పపువా న్యూగినియా, నెదర్లాండ్స్, నేపాల్ జట్లు కూడా టీ20 ప్రపంచకప్‍లో ఆడనున్నాయి.
ఐదు గ్రూప్‍ల్లో చెరో గ్రూప్‍లో టాప్-2లో నిలిచే జట్లు సూపర్-8 దశకు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత సూపర్-8లో టాప్‍లో ఉండే నాలుగు జుట్లు సెమీఫైనల్‍కు చేరతాయి. సెమీస్ మ్యాచ్‍ల్లో గెలిచిన రెండు జట్లు ఫైనల్‍లో తలపడతాయి.
టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశలో టీమిండియా మ్యాచ్‍లు
- జూన్ 5 - భారత్ vs ఐర్లాండ్ - న్యూయార్క్‌లో..
- జూన్ 9 - భారత్ vs పాకిస్థాన్ - న్యూయార్క్‌లో..
- జూన్ 12 - భారత్ vs అమెరికా - న్యూయార్క్‌లో..
- జూన్ 15 - భారత్ vs కెనడా - ఫ్లోరిడాలో..
భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్‍లు ప్రారంభం అవుతాయి. గ్రూప్ స్టేజీలో తన గ్రూప్‍లో టాప్-2లో నిలిస్తే భారత్ సూపర్-8 దశకు చేరుతుంది. జూన్ 9న భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే పోరు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ కంటే ముందే.. ఈ ఏడాది ఐపీఎల్ 2024 టోర్నీ జరగనుంది. మార్చి 22న ఐపీఎల్ 17వ సీజన్ షురూ కానుంది. ఐపీఎల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్‍ను జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఉచితంగా చూడొచ్చు.