T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ లో ఇప్పటి వరకూ చూస్తే అత్యధిక పరుగులు చేసింది విరాట్ కోహ్లి. అత్యధిక వికెట్లు తీసుకున్నది బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్. కానీ ఈసారి మాత్రం మరో ఇద్దరి పేర్లను చెబుతున్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. అందులో ఒకరు బుమ్రా కాగా.. మరొకరు ట్రావిస్ హెడ్ కావడం విశేషం.
ఐపీఎల్ 2024లో రాణించిన బుమ్రా, ట్రావిస్ హెడ్ లే ఈసారి టీ20 వరల్డ్ కప్ లో రాణిస్తారని పాంటింగ్ అంచనా వేశాడు. జూన్ 1 నుంచి జూన్ 29 వరకు జరగనున్న ఈ టోర్నీలో టాప్ పర్ఫార్మర్ల గురించి అతడు మాట్లాడాడు. ఈ మధ్యే ముగిసిన ఐపీఎల్లో బుమ్రా 20 వికెట్లతో రాణించగా.. ట్రావిస్ హెడ్ 15 మ్యాచ్ లలో ఏకంగా 567 రన్స్ చేశాడు. ఒక సెంచరీ కూడా ఉంది.
ముంబై ఇండియన్స్ చివరి స్థానంలో నిలిచినా.. ఆ జట్టులో బుమ్రా ఒక్కడే నిలకడగా రాణించాడు. దీంతో రాబోయే వరల్డ్ కప్ లో టీమిండియా అతనిపై భారీ ఆశలే పెట్టుకుంది. అటు టాప్ ఫామ్ లో ఉన్న హెడ్ కూడా తమకు ప్లస్ అవుతాడని ఆస్ట్రేలియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూతో పాంటింగ్ మాట్లాడాడు.
"టోర్నమెంట్లో నా అభిప్రాయం ప్రకారం అత్యధిక వికెట్లు తీసేది బుమ్రానే. చాలా ఏళ్లుగా అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్లో కళ్లు చెదిరే రీతిలో బౌలింగ్ చేసి వస్తున్నాడు. కొత్త బంతితో అతడు స్వింగ్ చేయగలడు. ఐపీఎల్ ముగిసే సమయానికి అతని ఎకానమీ రేటు ఏడు కంటే తక్కువే ఉంది. అతడు వికెట్లు తీయగలడు. కఠినమైన ఓవర్లు కూడా వేయగలడు. టీ20 క్రికెట్ లో ఇలా పరుగులు తక్కువగా ఇచ్చే ఓవర్లు వేస్తే వాటితోపాటే వికెట్లు కూడా వస్తాయి. అందువల్ల బుమ్రాకే నా ఓటు" అని పాంటింగ్ స్పష్టం చేశాడు.
ఇక బ్యాటింగ్ లో అత్యధిక పరుగులు చేసిది ట్రావిస్ హెడ్ అని పాంటింగ్ అన్నాడు. ఐపీఎల్లో అతడు నాలుగో స్థానంలో నిలిచాడు. కానీ 200 వరకు ఉన్న అతని స్ట్రైక్ రేట్ ప్రత్యర్థులకు దడ పుట్టించేదే. దీంతో ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లోనూ హెడ్ టాప్ స్కోరర్ అవుతాడని పాంటింగ్ అంచనా వేస్తున్నాడు.
"అత్యధిక పరుగుల చేసేది ట్రావిస్ హెడ్ అని భావిస్తున్నాను. రెండేళ్లుగా రెడ్ బాల్ అయినా వైట్ బాల్ అయినా అతడు అత్యుత్తమ ప్రమాణాలతో చేశాడు. ప్రస్తుతం భయం లేని క్రికెట్ ఆడుతున్నాడు. ఐపీఎల్లో ఎగుడుదిగుడులు ఉన్నాయి. కానీ బాగున్నప్పుడు మాత్రం చాలా బాగుంది. తన జట్టుకు విజయాలు సాధించి పెట్టాయి" అని పాంటింగ్ అన్నాడు.
ఆస్ట్రేలియా విషయంలోనూ అదే జరుగుతుందని అంచనా వేశాడు. నిలకడగా రాణించకపోయినా.. అత్యధిక పరుగులు చేసే వాళ్లలో హెడ్ ఉంటాడని అన్నాడు. క్రీజులో కాస్త ఎక్కువసేపు అతడు ఉంటే.. ఆస్ట్రేలియాకు మ్యాచ్ లు గెలిపించగలడని చెప్పాడు.